హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌సిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. హయత్ నగర్, బండ్లగూడ, సరూర్ నగర్, ఉప్పల్, బాలానగర్, షేక్ పేటలో ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో దంచికొట్టింది. అత్యధికంగా హయత్‌నగర్ లో 3.18 సెంటీమీటర్ల వాన పడింది. బండ్లగూడలో 1.95, సరూర్ నగర్ లో1.83సెం.మీ. వాన కురిసింది.
చాలాచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఐటీ కారిడార్‌లోని రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్నుంచి కేపీహెచ్ బీ వైపు, ఖాజగూడ సిగ్నల్నుంచి షేక్‌పేట ఫ్లైఓవర్ వైపు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. మరో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం 6.4 సెం.మీ. నుంచి 11.5 సెం.మీ. కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.