హైదరాబాద్​లో రెండు గంటల పాటు భారీ వర్షం

హైదరాబాద్​లో రెండు గంటల పాటు భారీ వర్షం
  • రోడ్లన్నీ జలమయం 
  • అత్యధికంగా బేగంబజార్​లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం 
  • జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు.. దక్షిణాది జిల్లాలకు విస్తరించిన రుతుపవనాలు 
  • రానున్న ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలు 

హైదరాబాద్, వెలుగు: రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. బుధవారం పలు జిల్లాల్లో మోస్తరు వానలు కురిశాయి. హైదరాబాద్ లో మాత్రం కుండపోత వర్షం కురిసింది. సిటీలో సాయంత్రం 4:45 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలాచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. 

శిల్పారామం, కేపీహెచ్​బీ, కూకట్​పల్లి, గచ్చిబౌలి, అసెంబ్లీ, సరూర్​నగర్, బయోడైవర్సిటీ, తెలుగు తల్లి ఫ్లైఓవర్, మాదాపూర్​తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచింది. పలుచోట్ల నాలాలు ఉప్పొంగాయి. ఎల్బీ నగర్, శిల్పారామం, మధురానగర్, మాసబ్​ట్యాంక్, హైకోర్టు, కంచన్​బాగ్ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వర్షానికి సంబంధించి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్​టీమ్స్​కు 25 వరకు ఫిర్యాదులు అందాయి. సిటీలో అత్యధికంగా బేగంబజార్​లోని దూద్​ఖానాలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కందికల్​గేట్​వద్ద 8.2, సదర్​మహల్​లో 8, అల్లాపూర్​లో 7.6, యూసుఫ్​గూడలో 7.5

జుమ్మెరాత్ బజార్​లో 7.3, బార్కాస్​లో 7.2, ఇందిరానగర్​కమ్యూనిటీ హాల్​వద్ద 6.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్​లో 6.1, ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 5.4, సూర్యాపేట జిల్లా రెడ్డిగూడలో 5.1, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో 4.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

తగ్గుతున్న ఎండలు.. 

రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. రుతుపవనాల రాకతో వర్షాలు మొదలై టెంపరేచర్లు దిగివస్తున్నాయి. బుధవారం ములుగు, జయశంకర్​భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో టెంపరేచర్లు తగ్గాయి. అత్యధికంగా ములుగు, మంచిర్యాలలో 42.9 డిగ్రీల టెంపరేచర్​ రికార్డ్​కాగా.. భూపాలపల్లిలో 42.6, పెద్దపల్లిలో 42.5, జగిత్యాలలో 42.5, ఆసిఫాబాద్ లో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 41 కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న మూడు రోజుల్లో టెంపరేచర్లు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి.

ఎల్లో అలర్ట్ జారీ.. 

నైరుతి రుతుపవనాలు మరింత యాక్టివ్​గా ముందుకు కదులుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని నారాయణపేటతో పాటు దక్షిణాదిలోని జిల్లాలకు విస్తరించాయని పేర్కొంది. మరో మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటికి విస్తరించే అవకాశాలున్నట్టు తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గ్రేటర్​తో పాటు రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్​గిరి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం

నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్​, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.