![ఢిల్లీలో రెండ్రోజులుగా ఎడతెరిపి లేని వాన](https://static.v6velugu.com/uploads/2022/10/Heavy-Rain-Hits-Delhi-For-2nd-Day_gwWC5NaDVS.jpg)
లోతట్టు ప్రాంతాలు జలమయం.. ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం నుంచి కురుస్తున్న వానలు దేశ రాజధానిని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కూడా ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ తెలిపింది.
ధౌలాఖాన్, నజఫ్‌ఘర్, నరైన, రింగ్ రోడ్, తీన్‌మూర్తి మార్గ్‌లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆనంద్ విహార్, వజీరాబాద్, ఐఎన్‌ఏ నుంచి ఎయిమ్స్, మెహ్రౌలి బర్దార్‌పూర్ రోడ్, తుగ్లకాబాద్, సంగం విహార్, కిరారి, రోహ్‌తక్ రోడ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలతో ఢిల్లీలో టెంపరేచర్లు 10 డిగ్రీలకు పడిపోయాయని, ఎయిర్ క్వాలిటీ కాస్తా పెరిగిందని అధికారులు వెల్లడించారు. కాగా, ఢిల్లీలో సోమవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రెండ్రోజులుగా ఢిల్లీలో కురుస్తున్న వర్షాలపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాల మునక, ట్రాఫిక్ జామ్‌లపై మీమర్స్ ఫన్నీ మీమ్స్ వదులుతున్నారు. పుష్ప సినిమాలోని ‘‘తగ్గేదే లే” డైలాగ్‌ను వర్షాలకు కనెక్ట్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు.