హైదరాబాద్ లో కుండపోత వాన.. సెప్టెంబర్ 28 వరకు భారీ వర్షాలు

నిన్న(సెప్టెంబర్ 21) అర్ధరాత్రి హైదరాబాద్ లో కుండపోత వాన పడింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్,  ఖైరతాబాద్, అమీర్ పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, కాప్రా, ECIL, మల్కాజ్ గిరి, ముషీరాబాద్ లో భారీ వర్షం పడింది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. 

హైదరాబాద్ నగరవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 28 వరకు రాష్ట్రంలో అక్కడకక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణశాఖ అధికారులు.

రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈరోజు(సెప్టెంబర్ 22) తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 23, 24 పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఇటు రాష్ట్రానికి మూడ్రోజుల రెయిన్ అలెర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణశాఖ.

భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం, మెదక్, మేడ్చల్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని  తెలిపింది.