నిర్మల్​, ఆదిలాబాద్​, మంచిర్యాలలో భారీ వాన .. ప్రాజెక్టులకు జలకళ

నిర్మల్​, ఆదిలాబాద్​, మంచిర్యాలలో  భారీ వాన .. ప్రాజెక్టులకు జలకళ
  • ప్రాజెక్టులకు జలకళ
  • ఎగువన వర్షాలతో జిల్లాకు వరదపోటు

 వెలుగు నెట్​వర్క్​ : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి, ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు,  వంకలు ఉప్పొంగాయి. మత్తడివాగు ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో 3 గేట్లు ఎత్తి 17,100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.   నిర్మల్​ జిల్లాలోని పలు గ్రామాలనూ వర్షం విడువలేదు.  మంచిర్యాల, ఆసిఫాబాద్​లో  ఓ మోస్తారు వర్షం కురిసింది.  ఎగువన కురుస్తున్న వర్షాలతో పెన్ గంగాకు  వరద పోటెత్తింది.  జైనథ్ మండలంలోని ఆనంద్ పూర్  వద్ద ,  తాంసి మండల కేంద్రంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో   రాకపోకలు నిలిచిపోయాయి. నేరడిగొండ మండలంలోని కుంటాల, బోథ్ మండలంలోని పొచ్చర జలపాతాలకు వరద పెరిగింది.  

రెడ్​ అలర్ట్​.. 

రెండు రోజులు వర్షాలు ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్​ కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నంబర్ 18004251939, ఆర్​ ఆండ్​ బీ  కంట్రోల్ రూమ్ 8106128195 ను ఏర్పాటు చేశారు.   బైంసా లో   గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో. 15వేల క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసి వదలడంతో సుద్ద వాగు ఉప్పొంగి ప్రవహించింది.  పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల  గుండెగాం గ్రామం వద్ద  వంతెన పై నుంచి నీరు ప్రవహించడంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి.  కోటపల్లి మండలంలో  మల్లంపేట–- నక్కలపల్లి గ్రామాల మధ్య ఉన్న లోతు ఒర్రే కాజ్ వే   కొట్టుకుపోయింది.    

కడెం ప్రాజెక్ట్​కు వరద 

జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కడెం, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి  పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది.  కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. కడెం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 27,282  సెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు 19,122 క్యుసెక్కుల నీరును వదులుతున్నారు. 

ALSO READ : నిండుకుండల్లా హైదరాబాద్ జంట నగరాల జలాశయాలు

 

 ఎల్లంపల్లి కి వరద..

 ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలకు  ఆదివారం ఉదయం 18.20 టీఎంసీలకు చేరింది. కడెం ప్రాజెక్టు, క్యాచ్​మెంట్​ ఏరియా నుంచి భారీగా వరద రావడంతో అధికారులు 20 గేట్లు ఓపెన్​ చేశారు. సాయంత్రం 7 గంటలకు కడెం నుంచి 38,065, క్యాచ్​మెంట్​ ఏరియా నుంచి 67,519, మొత్తం 1,05,584 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతోంది. హైదరాబాద్​ మెట్రో వాటర్​ స్కీమ్​కు 304 క్యూసెక్కులు రిలీజ్​  చేస్తుండగా, నంది పంపు హౌస్​ ద్వారా 9,450 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు 62 గేట్లకు గాను 20 గేట్లు ఓపెన్​ చేసి 1,34,414 క్యూసెక్కులు గోదావరిలోకి రిలీజ్​ చేస్తున్నారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే పాయల్​ శంకర్​

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు; భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ ఆదివారం ఒక ప్రకటన  లో  ప్రజలను కోరారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళలని సూచించారు.  ఉధృతంగా ఉన్న కాలువలు చెరువుల వద్దకు వెళ్లొదన్నారు. సత్నాల పరివాహక ప్రాంతం, ఇతర వాగుల పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా   ఉండాలని, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పరిస్థితులను తెలుసుకుంటూ సూచనలిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సమయంలో నేరుగా తనకు లేదా  అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.