చెన్నైలో 24 గంటలుగా నాన్ స్టాప్ వర్షం : సిటీ అంతా అల్లకల్లోలం

చెన్నైలో 24 గంటలుగా నాన్ స్టాప్ వర్షం : సిటీ అంతా అల్లకల్లోలం

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై.. ఈ మహా నగరం ఇప్పుడు మునిగిపోయింది. అవును.. 24 గంటలుగా.. అక్టోబర్ 15వ తేదీ రోజు మొత్తం.. వర్షం పడింది. అంతేనా.. 16వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. నాన్ స్టాప్ గా పడుతున్న భారీ వర్షంతో.. చెన్నై సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోని వేల ఇళ్లు నీట మునిగాయి. రోడ్లపై నడుం లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. రోడ్లు జలమయం. కార్లు, బైక్స్ మునిగిపోయాయి. సిటీలోని ఏ ప్రాంతం చూసినా ఏముందీ.. అంతా మునకే అన్నట్లు ఉంది చెన్నై సిటీ జనం పరిస్థితి. సహాయ చర్యలు కొనసాగుతున్నా.. మరో వైపు భారీ వర్షం పడుతూనే ఉండటంతో.. అంతా గందరగోళం.. అల్లకల్లోలంగా మారింది సిటీ పరిస్థితి.

 

భారీ వర్షాలకు చెన్నై సిటీలోని 11 సబ్ వేలు మూసివేశారు అధికారులు. మెట్రో రైలు సర్వీసులను సైతం తాత్కాలికంగా రద్దు చేశారు. వరద సహాయ చర్యల్లో 16 వేల మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నా.. ఏ మాత్రం సరిపోవటం లేదు. చెన్నై సిటీలోనే 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  

చెన్నై సిటీలో నాన్ స్టాప్ గా పడుతున్న భారీ వర్షంతో..  విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇంటర్నేషనల్ విమానాలకు చెందిన ఆరు సర్వీసులను రద్దు చేశారు. ఇక చెన్నై నుంచి మధురై, సేలం, మధురై-, షిర్డి- ప్రాంతాలకు వెళ్లే డొమెస్టిక్ విమాన సర్వీసులను రద్దు చేశారు. మరో వైపు చెన్నై సిటీకి రాకపోకలు సాగించే చాలా రైలు సర్వీసులు రద్దు అయ్యాయి. ఇప్పటికే 4 అంతరాష్ట్ర రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. ఓ వైపు విమాన సర్వీసులు.. ఇంకో వైపు రైలు సర్వీసులు రద్దు కావటంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

భారీ వర్షాలతో చెన్నైలో స్కూల్స్, కాలేజీలు, ఇతర ఎడ్యుకేషన్ అన్ని ఇనిస్టిట్యూట్స్ కు సెలవులు ప్రకటించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ చెన్నై కార్పొరేషన్ తోపాటు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో.. చెన్నై సమీపంలోనే తీవ్ర వాయుగుండం తీరం దాటుతుండటంతో.. మరో మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.