- ఒక్కరోజే 20.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
- ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ప్రకటించిన వాతావరణశాఖ
- ఉప్పొంగుతున్న వాగులు.. నిండుతున్న చెరువులు
- రోడ్లపైకి.. కాలనీల్లోకి వరద.. ఇబ్బందుల్లో స్థానికులు
- ముందస్తు చర్యలపై అధికార యంత్రాంగం సమీక్ష
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో వర్షం దంచికొట్టింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి మొదలై.. శనివారం మొత్తం వాన కురుస్తూనే ఉంది. ఎర్రుపాలెం మండలంలో రాత్రి 9 గంటల వరకు 205 మిల్లీమీటర్ల (20.5 సెంటీమీటర్ల) వర్షం కురిసింది. ఆ తర్వాత మధిర మండలంలో 193.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు రాష్ట్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మధిర నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన కరీంనగర్ జిల్లా పర్యటనను మధ్యలోనే ముగించుకొని మధిరకు చేరుకున్నారు.
వాగులు, వంకలు ఉప్పొంగుతుండడం, చెరువులు నిండుతుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలన్నారు. అత్యవసమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలను తాకొద్దన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని, వెంటనే అధికారులు వారికి కావాల్సిన సహాయ చర్యలు తీసుకుంటారని తెలిపారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చెరువులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎర్రుపాలెం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన మలిశెట్టి సాంబ(20) శనివారం బైక్ పై భీమవరం నుంచి అగ్రహారం మధ్యలోని వాగు దాటుతుండగా వరద ఉధృతికి గల్లంతయ్యాడు. అధికారులతో పాటు స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రుపాలెం మండలంలోని తెగళ్లపాడు ఆర్వోబీ దగ్గర వరద ధాటికి ఆర్టీసీ బస్సు కొంత దూరం కొట్టుకుపోయింది.
రోడ్డుపై ఉధృతంగా వరద ప్రవాహం ఉన్నా.. డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రయాణికులు కేకలు వేయగా, స్థానికులు ట్రాక్టర్ల ద్వారా ప్రయాణికులను రక్షించారు. ఎర్రుపాలెం మండలం చెర్లపాలెం చెరువుకు గండి పడింది. 200 ఎకరాలకు పంట నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. పెనుబల్లి మండలం రాథోని చెరువు అలుగు పారడంతో పెనుబల్లి మండల కేంద్రం నుంచి గంగాదేవిపాడుకి వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ లో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఆఫీసర్లు అలర్ట్..
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను అలర్ట్ చేశారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో ముందస్తు జాగ్రత్త చర్యలపై సమీక్షించారు. ప్రజలు సహాయం కోసం 9063211298, టోల్‌ఫ్రీ నంబర్1077కు కాల్, వాట్సాప్ చేయొచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకల వద్ద మత్తడి పొంగిపొర్లే ప్రాంతాలను గుర్తించి 24 గంటలు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంపీవోలు భారీ వర్షాల నేపథ్యంలో హెడ్ క్వార్టర్‌లో ఉండి సమన్వయంతో పనులు చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దామిని యాప్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, పిడుగుల నుంచి రక్షణ పొందేలా చైతన్యం తేవాలని
సూచించారు.
వర్షపాతం వివరాలు
మండలం వర్షపాతం (మి.మీ.లలో)
ఎర్రుపాలెం 205
మధిర 193.4
కూసుమంచి 74.2
నేలకొండపల్లి 88.4
ముదిగొండ 59.8
కేఎంసీ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్
భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 7901298265, 9866492029 నంబర్లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ఆయన సూచించారు. రఘునాథపాలెం మండల ప్రజల కు హెల్ప్ లైన్ నంబర్ 7901298265 ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ లూథర్ విల్సన్ తెలిపారు.