హైదరాబాద్​లో భారీ వర్షం

  • భారీగా ట్రాఫిక్​ జామ్​
  • కొన్ని కాలనీల్లో మోకాళ్ల లోతు చేరిన నీళ్లు 
  • హుస్సేన్ సాగర్​లో కొట్టుకుపోయిన బోట్ 
  • గంటలోనే 5 సెం.మీ వర్షపాతం 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఆర్సీపురం, గచ్చిబౌలి, గాజులరామారం, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో గంట వ్యవధిలోనే 5 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులకు హుస్సేన్ సాగర్ లో భాగమతి బోట్ ఒక పక్కకు కొట్టుకుపోయింది. ఆ సమయంలో బోట్ లో 40 మంది టూరిస్టులు ఉన్నారు. అదృష్టవశాత్తూ బోట్ ఒడ్డుకు తిరిగిరావడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అత్యవసరమైతే తప్ప ఇండ్లలోంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అనేక కాలనీల్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. చందానగర్ లో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. కూకట్ పల్లిలోని బాలాజీగనర్ లో ఓ కారుపై చెట్టు విరిగిపడింది. చందానగర్ లో ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ కారులోకి వరద నీరు చేరింది. వరద ఉధృతంగా ఉంటే 040–-29555500 నంబర్ కు కాల్ చేయాలని ఈవీడీఎం అధికారులు సూచించారు. వికారాబాద్ జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. మర్పల్లిలో ఓ ఇంటిపై పిడుగుపడింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈదురుగాలులకు నాలుగైదు ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి.

ఎక్కడెంత వర్షం పడిందంటే..

ప్రాంతం                    వర్షపాతం (సెం.మీ)
ఆర్సీపురం                      7.9
గచ్చిబౌలి                       7.7
గాజులరామారం             6.0
కుత్బుల్లాపూర్                5.5
హైదర్ నగర్                   5.3
హెచ్ సీయూ                  5.1