హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి వాన దంచికొడుతోంది. దీంతో రోడ్లపైకి ఎక్కడికక్కడ వర్షపునీరు పారుతోంది. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 గంటల పాటు హైదరాబాదగ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రాంతంలో రోడ్లపై వర్షపు నీరు పారుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం 14 నీటమునిగింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బోడుప్పల్,పీర్జాది గూడా ప్రాంతాలలో దంచికొడుతోంది.
సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వాన పడుతోంది. చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ అంతటా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడతాయని హెచ్చరించింది.