హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. మెహదీపట్నం, అత్తాపూర్, ఉప్పర్ పల్లి, హైదర్ గూడ, ఆరాంఘర్, రాజేంద్ర నగర్ ఏరియాల్లో వర్షం దంచి కొడుతోంది. మెహదీపట్నం వైపు వెళ్లే మార్గాలన్ని జలమయం అయ్యాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్ నగర్, మలక్ పేట, చార్మినార్ ప్రాంతాల్లో వాన పడుతోంది. నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.
కుండపోత వర్షంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరద నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప నగరవాసులు బయటకు వెళ్లొద్దని జీహెచ్ఎంసీ సూచించింది.