- హైవేలు, ఫ్లైఓవర్లపై కిలోమీటర్ల మేర నిలినిన ట్రాఫిక్
హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా పఠాన్‌చెరులో 6.15 సెంటీమీటర్ల వాన పడింది. పగలంతా వాతావరణం పొడిగా ఉండగా, సాయంత్రం 5 గంటల తర్వాత నల్లటి మేఘాలు సిటీని కమ్మేశాయి. జల్లులతో మొదలైన వాన పలు ప్రాంతాల్లో దంచికొట్టింది. కుత్బుల్లాపూర్‌లో 4.58, లంగర్ హౌస్ లో 4.28, గచ్చిబౌలిలో 3.85, హెచ్‌సీయూలో 3.48 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, చందానగర్, రాయదుర్గం, హఫీజ్‌పేట రోడ్లు జలమయమయ్యాయి.
కాలనీల రోడ్లు కాల్వలను తలపించాయి. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే టైమ్కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్స్తంభించింది. శిల్పారామం, కొత్తగూడ, బయోడైవర్సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్, మాదాపూర్ బాటా షోరూం, సీఓడీ జంక్షన్, నెక్టార్‌గార్డెన్, లింగంపల్లి బ్రిడ్జి, ఆల్విన్ క్రాస్‌రోడ్డు ప్రాంతాల్లోని రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో బయోడైవర్సిటీ నుండి జేఎన్టీయూ రూట్, కొత్తగూడ నుండి హఫీజ్‌పేట రూట్, గచ్చిబౌలి జంక్షన్, గచ్చిబౌలి నుంచి ఖాజాగూడ రోడ్డు, ఆవాస హోటల్నుంచి సైబర్ టవర్స్రూట్ లో వెహికల్స్బారులు తీరాయి.
దీంతో బైకులు, ఆటోల్లో వెళ్లే ఉద్యోగులు గల్లీలో నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కొండాపూర్, మాదాపూర్ ఏరియాల్లోని కాలనీల్లో సైతం ట్రాఫిక్ జామ్ఏర్పడింది. క్లియర్చేసేందుకు ట్రాఫిక్పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీ మాన్సూన్ టీం సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని మోటార్ల సాయంతో తొలగించారు. మరో రెండ్రోజులు మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వాన పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.