హైదరాబాద్ సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. 2024, సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం నుంచి తెరిపించినట్లు కనిపించినా.. మళ్లీ సాయంత్రానికి వర్షం మొదలైంది. సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, మాదాపూర్, పంజాగుట్ట, మెహదీపట్నం ఏరియాల్లో భారీ వర్షం పడుతుంది.
దిల్ షుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట, చంపాపేట, చాదర్ ఘాట్, బషీర్ బాగ్, కూకట్ పల్లి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, బేటంపేట, సికింద్రాబాద్ ఏరియాల్లోనూ వర్షం పడుతుంది.
వినాయకచవితి మండపాలకు గణేషులను తరలిస్తూ.. సందడిగా మారిన సమయంలో భారీ వర్షం ఇబ్బంది పెడుతోంది. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా పడుతున్న వర్షంతో ఇబ్బంది పడుతున్న సిటీ జనం.. వినాయక చవితి రోజుకు అయినా తగ్గుతుందని భావించినా.. అందుకు భిన్నంగా ముందు రోజు భారీ వర్షం పడటంతో.. మండపాల దగ్గర ఏర్పాట్లకు ఇబ్బందిగా మారింది.
సిటీ మొత్తం వర్షం పడుతుండటంతో.. వాహనాలు నిదానంగా సాగుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో ట్రాఫిక్ జాం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో వర్షం తగ్గిన తర్వాత ఒకేసారి ఆఫీసుల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.