హైదరాబాద్ లో భారీ వర్షం మొదలైంది. నల్లని మబ్బులతో చీకట్లు కమ్ముకున్నాయి. అక్కడక్కడా ఉరుములతో వర్షం పడుతోంది. దాదాపు సిటీ అంతా వర్షం దంచికొడుతోంది. వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చినట్లుగానే సాయంత్రం నుంచి భారీ వర్షం మొదలైంది. ఇప్పటికే GHMC అధికారులు కిందిస్థాయి సిబ్బందిని అలర్ట్ చేశారు. GHMC కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సిటీ శివార ప్రాంతాలు సహా.. అన్నిచోట్ల భారీ వర్షం పడుతోంది. ఇప్పుడు పడుతున్న వర్షాన్ని చూస్తే.. 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం పడొచ్చన్న అంచనాలున్నాయి. భారీ వర్షంతో రోడ్లమీద, కాలనీలు, బస్తీలలో వర్షపు నీరు నిలిచిపోయింది. జీడిమెట్లలోని అయోధ్య నగర్ లోవరద నీరు భారీగా చేరింది. ఇంట్లోకి కూడా వెళ్లలేకుండా నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. GHMC కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని చోట్లకు చేరుకోలేకపోతున్నామని చెబుతున్నారు GHMC మాన్సూన్ ఎమెర్జెన్సీ టీమ్ సిబ్బంది.