ఉరుములు, మెరుపులతో కుండపోత

ఉరుములు, మెరుపులతో కుండపోత
  • గంటన్నరపాటు వణికించిన వాన 

  • అత్యధికంగా గోల్కొండలో 9.1 సెం.మీ వర్షం

  • నీట మునిగిన లోతట్టుప్రాంతాలు

  • చాలాచోట్ల ఇండ్లు,సెల్లార్లలోకి చేరిన వరద నీరు

  • ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్​ జామ్.

హైదరాబాద్ సిటీ/బషీర్​బాగ్/మెహిదీపట్నం/పంజాగుట్ట, వెలుగు: గ్రేటర్​సిటీలో శనివారం వాన దంచికొట్టింది. ఉదయం మోస్తరు వాన కురవగా, సాయంత్రం 7 గంటల తర్వాత భారీ వర్షం కురిసింది. దాదాపు గంటన్నర పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వరుణుడు విరుచుకుపడ్డాడు. అత్యధికంగా గోల్కొండలో 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇండ్లలోకి, అపార్ట్​మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరింది. రోడ్లపై మోకాలు లోతున వర్షపు నీరు నిలిచింది. చాలాచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్​స్తంభించింది. ఇండ్లకు వెళ్లే టైం కావడంతో ఉద్యోగులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గౌలిగూడా టెలిఫోన్ ఎక్స్​చేంజ్​ఆఫీస్​పక్కనున్న బస్తీ పూర్తిగా నీట మునిగింది. 

నాంపల్లి, అబిడ్స్ లోని హోటళ్లు, షాపుల్లోకి వరద చేరింది. నాంపల్లి స్టేషన్ రోడ్ నుంచి రవీంద్రభారతి వరకు ట్రాఫిక్ స్తంభించింది. నిలోఫర్ హాస్పిటల్ కు వెళ్లాల్సిన ఓ అంబులెన్స్ అందులో చిక్కుకుపోయింది. మంగళహాట్ ఏరియాలోని ఓ పాత ఇల్లు కూలింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఆగాపురాలో చెట్టు కూలడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గుడిమల్కాపూర్ మార్కెట్ వద్ద వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. మాసాబ్ ట్యాంక్ నుంచి లక్డీకాపూల్​వరకు వాహనాలు నిలిచిపోయాయి. హైడ్రా కమిషనర్​రంగనాథ్​బేగంపేటలో పర్యటించారు. నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. అత్యవసరమైతే జీహెచ్ఎంసీ హెల్ప్‌‌‌‌లైన్ 040–--21111111, డీఆర్ఎఫ్ 90001 13667 నంబర్లలో సంప్రదించాలని కమిషనర్​ ఆమ్రపాలి సూచించారు.