ఆగకుండా 6 గంటలు..హైదరాబాద్లో భారీ వర్షం

ఆగకుండా 6 గంటలు..హైదరాబాద్లో భారీ వర్షం
  •     ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్ 
  •     వాహనదారులకు తప్పని ఇబ్బందులు 
  •     లోతట్టు ప్రాంతాలు జలమయం 
  •     పోలీసులు, బల్దియా, హెచ్ఎండీఏ అలర్ట్
  •     వెంటనే చేపట్టిన సహాయక చర్యలు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​లో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు 6 గంటలు భారీ వర్షం దంచికొట్టింది. దారులన్నీ ఏరులు కావడంతో ట్రాఫిక్​ స్తంభించింది. పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్​సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు, బల్దియా, హెచ్​ఎండీఏ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 

మేయర్ టెలికాన్ఫరెన్స్​

సిటీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోనల్ కమిషనర్, ఈవీడీఎం టీమ్​తో  మేయర్ గద్వాల విజయలక్ష్మీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.

శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ తోపాటు వరద ప్రభావిత ప్రాంతాలైన దుర్గం చెరువు, నెక్టర్ గార్డెన్​లో  పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్  పర్యటించారు. జీహెచ్ఎంసీ కమిషనర్​ఆమ్రపాలి, డిప్యూటీ మేయర్ కూడా జోనల్ జోనల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

థియేటర్​లోకి వర్షపునీరు

భారీ వర్షం కారణంగా పంజాగుట్ట పీవీఆర్ థియేటర్​లోకి వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో కల్కి సినిమా ప్రదర్శన నిలివేయాలని ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని యాజమాన్యాన్ని  నిలదీశారు.

నలుగురిని కాపాడిన యువకులు

ముషీరాబాద్, వెలుగు : ముషీరాబాద్ డివిజన్ బాపిస్ట్ చర్చ్ ప్రాంతంలో వరద ఉధృతిలో ఓ కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో నలుగురు ప్రయాణికులు అందు లోనే ఉండిపోయారు. స్థానిక యువకుడు ప్రణీత్ యాదవ్, అతడి స్నేహితులు రిస్క్ చేసి కారును గోడ పక్కకు తీసుకొచ్చి అద్దాలు పగలగొట్టారు. ఆపై అం దులోని వారిని బయటకు తీసుకువచ్చి ప్రాణాలు కాపాడారు.