సిటీలో కుండపోత వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరిక

సిటీలో కుండపోత వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరిక

హైదరాబాద్ సిటీలో వర్షం దంచికొడుతోంది. సాయంత్రం 7గంటల సమయంలో ఒకేసారి వర్షం దంచికొట్టింది. గంటన్నర పాటు కుండపోత వర్షం పడి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి వర్షం అందుకుంది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉప్పల్, బోడుప్పల్, తార్నాక, ఓయూ,అంబర్ పెట్ ఎల్బీనగర్ లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, చందానగర్, మియాపూర్ లోనూ వర్షం దంచికొడుతోంది.

గండిపేటలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఉప్పల్ లో 4.4, సరూర్ నగర్, సైదాబాద్ లో 4.3, షేక్ పేట్ లో 4.2, బండ్లగూడలో 3.5 సెంటీమీటర్ల వర్షం పడింది. ముషీరాబాద్,కూకట్ పల్లిలో 3.3సె.మీ, శేరిలింగంపల్లి, వెస్ట్ మారేడుపల్లిలో 3, ఖైరతాబాద్ లో 2.7, నాగోల్, మొండా మార్కెట్ లో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. గచ్చిబౌలి, మాదాపూర్ లో 2.4 సెంటీమీటర్లు, చిలకలగూడ, అత్తాపూర్ లో 2.3 సె.మీ, ఆసిఫ్ నగర్, అంబర్ పేట్ లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. 

భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. చాలా చో ట్ల నడుము లోతు నీళ్లు ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షంతో మూసారాంబాగ్ దగ్గర బ్రిడ్జిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేశారు పోలీసులు. లోతట్లు ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి.

మరోగంట పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. 
అవసరమైతే తప్ప బయటికి రాకపోవడమే బెటర్ అని సూచించారు. మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేశారు. ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ. జనం జాగ్రత్తగా ఉండి ఏమైనా సమస్యలు వస్తే GHMC కాల్ సెంటర్ కి ఫోన్ చేయాలని సూచించారు.

రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని తెలిపారు. ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందన్నారు. రేపు సాయంత్రం తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 27వ తేదీన బంగళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని..ఈ ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో  మరో అల్పపీడనం ఏర్పడే చాన్సుందన్నారు. దీని ప్రభావంతో వర్షాలు కురిస్తాయని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు.

మరిన్ని వార్తల కోసం..

పాకిస్థాన్‌కు ప్రధాని మోడీ వార్నింగ్

భారత్‌కు రండి.. కరోనా వ్యాక్సిన్ కంపెనీలు పెట్టండి

భారత్ రిఫామ్స్ తెస్తే.. ప్రపంచం ట్రాన్స్‌ఫామ్ అవుతుంది