హైదరాబాద్ లో దంచికొట్టిన వాన... ఇవాళ ఎల్లో అలర్ట్

  • నాగోలులో అత్యధికంగా 8.95 సెం.మీ. వాన

హైదరాబాద్ సిటీ/గండిపేట/మేడ్చల్/ఉప్పల్, వెలుగు: సిటీలో మంగళవారం భారీ వర్షం కురిసింది. రోడ్లపై నిలిచిన సోమవారం నాటి వరద నీటిని తొలగించేలోపే వరుణుడు మరోసారి దంచికొట్టాడు. అత్యధికంగా నాగోలులో 8.95, ఉప్పల్​లోని బండ్లగూడలో 7.73, హబ్సిగూడలో 7.1, హయత్ నగర్ లో 5.05 సెంటీమీటర్ల వాన కురిసింది. అలాగే ముషీరాబాద్ లో 4.63, నాచారంలో 4.40 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆయా ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. కాలనీలను వరద ముంచెత్తడంతో స్థానికులతో పాటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్‌‌‌‌దేవ్‌‌‌‌పల్లి, బండ్లగూడ, కిస్మత్‌‌‌‌పూర్, హిమాయత్‌‌‌‌సాగర్, నార్సింగి, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, గండిపేట ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. మేడ్చల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మేడ్చల్​రాఘవేంద్రనగర్ కాలనీలో కార్లు నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉప్పల్ రింగ్​రోడ్డులో నిలిచిన వర్షపు నీటిని సిబ్బందితో కలిసి తొలగించిన ఉప్పల్ ట్రాఫిక్ సీఐ లక్ష్మీమాధవి రాచకొండ సీపీ సుధీర్​బాబు అభినందించారు.

మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. రోడ్ల పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పారు. అలాగే బుధవారం భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్(6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ. వాన కురిసే చాన్స్) జారీ చేసింది.