హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. రాత్రి వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నల్లటి మబ్బులతో నగరం మేఘావృతమైంది. మంగళవారం ( జులై 11) రాత్రి నగరంలోని జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బంజారా హిల్స్, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, సోమాజీగూడ, శేరిలింగపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, రాయదుర్గంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో రోడ్లపైకి నీరు భారీగా చేరుకోవడంతో ప్రయాణికులు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎడతెరిపి లేకుండా దంచికొట్టింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాన్ని కలిగించింది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. గంట వ్యవధిలోనే రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి మరో రెండురోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ( జులై 11) రాత్రి నుంచి నగరంలో ( వార్త రాసే సమయానికి) పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.తేలికపాటి జల్లులతో మొదలైన వర్షం ఏకధాటిగా కురిసింది.
అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, బేగంపేట్, నాచారం, కుషాయిగూడ, ఉప్పల్, నాగోల్, చార్మినార్, చంద్రాయణ్‌గుట్ట, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, లక్డికాపూల్, మెహిదిపట్నం, అత్తాపూర్, లంగర్ హౌజ్, ఆరాంఘర్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
ALSOREAD :వానాకాలం.. వ్యాధుల కాలం.. ఎలా చెక్ పెట్టాలంటే....
ఫలితంగా పలు చోట్ల రోడ్లపై వరదనీరు చేరింది. రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. వర్షం పడిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలు స్తంభించకుండా ట్రాఫిక్ పోలీసులు వర్షాన్ని సైతం లెక్కచేయలేదు. వర్షంలో తడుస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం కనిపించింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.