శుక్రవారం సాయంత్రం వాన పొట్టు పొట్టు కొట్టింది

శుక్రవారం సాయంత్రం వాన పొట్టు పొట్టు కొట్టింది
  • విజయవాడ జాతీయ  రహదారిపై నిలిచిన వరద నీరు..
  • నీటిలో నిలిచిపోయిన కార్లు, బైక్ లు

ఎల్బీనగర్/బషీర్ బాగ్/ మెహిదీపట్నం, వెలుగు :  సిటీతో పాటు శివారులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు  గంట పాటు దంచి కొట్టడంతో ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్​పిల్లలు ఇబ్బందులు పడ్డారు. దీంతో చాలామంది రోడ్ల పక్కన, ప్లై ఓవర్లు, మెట్రో కింద, బస్ స్టాపుల్లో ఆగిపోవాల్సి వచ్చింది. వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసుకునే వారు, విగ్రహాలు తరలించేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  బషీర్ బాగ్, అబిడ్స్ , కోఠి , నారాయణగూడ , హిమాయత్ నగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి అబిడ్స్ లోని గోపి హోటల్ లైన్ లో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి.

ఇక ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి నగర్, మీర్ పేట్ లో వర్షం కురవగా విజయవాడ జాతీయ రహదారిపై చింతలకుంటలో భారీగా వరద చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వరదకు మూడు కార్లు, పదుల సంఖ్యలో బైక్ లు నీళ్లో నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి.

వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్​మెంట్ టీం, ట్రాఫిక్ పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. టోలిచౌకి, లంగర్ హౌస్ మెయిన్​రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రోడ్లపై భారీగా వరద చేరి  ట్రాఫిక్ జాం అయింది.  

ఐటీ కారిడార్​లో ట్రాఫిక్​ జామ్

మాదాపూర్ : ఐటీ కారిడార్​లోని మాదాపూర్​, కొండాపూర్​, గచ్చిబౌలి, రాయదుర్గం, హఫీజ్​పేట్​, చందానగర్​, మియాపూర్​ ఏరియాల్లో సాయంత్రం వర్షం అతలాకుతలం చేసింది. ఐటీ ఉద్యోగులంతా ఇండ్లకు బయలుదేరడంతో బయోడైవర్సిటీ జంక్షన్​నుంచి ఐకియా జంక్షన్​, సైబర్​టవర్స్​ మీదుగా జేఎన్​టీయూ రూట్​లో ట్రాఫిక్​ స్తంభించింది.

బయోడైవర్సిటీ నుంచి గచ్చిబౌలి జంక్షన్​ మీదుగా ఐఐఐటీ జంక్షన్​వైపు, ఖాజాగూడ నుంచి షేక్​పేట్​వైపు, కొండాపూర్​ నుంచి హఫీజ్​పేట్​రూట్​లో ట్రాఫిక్​ నిలిచిపోయింది. దీంతో ఆటోలు, టూవీలర్స్​కాలనీల్లోని మర్లడంతో కాలనీ రోడ్లపై కూడా ట్రాఫిక్​జామ్​ఏర్పడింది. చందానగర్​లోని వేంకుంటలో ఇండ్ల మధ్య వరద చేరింది.

రాత్రి 11 గంటల వరకు వర్ష పాతం

ప్రాంతం         వర్షం(సెం.మీ)
 

గచ్చిబౌలి          4.38
ఆర్సీపురం     4.18
చందానగర్​    3.90
ఫిలింనగర్​        3.50
షేక్​పేట         3.48
హెచ్​సీయూ     3.30
విజయనగర్​కాలనీ  3.28
ఆసిఫ్​నగర్​    3.25
నాంపల్లి         3.20
హయత్​నగర్​    2.70
అత్తాపూర్     2.60