హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది.జూబ్లీహిల్స్,బంజారహిల్స్, యూసఫ్ గూడ్, బోరబండ, పంజాగుట్ట,అమీర్ పేట్, ఎర్రగడ్డ,కూకట్ పల్లి, మియాపూర్, లింగంపల్లి, కొండాపూర్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫిల్మింనగర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్,నాగోల్, సికింద్రాబాద్, అల్వాల్, ,కుత్బుల్లాపూర్, బాల్ నగర్, చింతల్ ఏరియాల్లో వర్షం పడుతోంది. పలు ఏరియాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ అయ్యింది.
హైదరాబాద్ తో పాటు దాదాపు అన్ని జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ఇవాళ జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలో భారీ వానలు కురిశాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరువానకు వాగులు ఉప్పొంగుతున్నాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు, నారాయణపురం వాగు ఉప్పొంగుతుంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. నారాయణపురం వాగులో చిక్కుకున్న కొందరు పశువుల కాపర్లు... ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. ప్రత్యేక హెలీకాప్టర్లను పంపిన అధికారులు.. బాధితులందరినీ క్షేమంగా రెస్క్యూ చేశారు. మరోవైపు దమ్మపేట మండలం జమేదారు బంజర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు పొలంలో పిడుగుపడి అన్నదమ్ములు చనిపోయారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్టుల్లోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పెనుబల్లి మండలంలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు.
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మంథని నియోజకవర్గవ్యాప్తంగా 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో భారీ వర్షానికి జనజీవనం స్థంభించింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి జనం ఇబ్బందిపడ్డారు. రామగిరి మండలంలో ఓసీపీ 2 గనిలో వర్షం నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం , మహాముత్తారం, మహాదేవపూర్ మండలాల్లో భారీ వానలకు చెరువులు,కుంటలు నిండిపోయాయి. చండ్రుపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో..పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఏపీ నంద్యాల శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల జలాశయం నుండి 25 వేల 174 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 806 అడుగులు ఉంది. మరోవైపు శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతుంది.