- రెండు గంటల్లో 9 సెంటీ మీటర్ల వర్షపాతం
- బన్సీలాల్‌పేట్‌లో 8.75 సెంటీ మీటర్లు
- వనస్థలిపురంలో నీట మునిగిన కార్లు, బైక్స్
- చాలా ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ సిటీలో గురువారం వాన దంచికొట్టింది. రెండు గంటల వ్యవధిలోనే 9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని చోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు, మరికొన్ని చోట్ల నడుం లోతు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వనస్థలిపురం పనామా వద్ద రెండు కార్లు, ఒక బైక్ పూర్తిగా మునిగిపోయాయి.
దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు నీటమునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో సాయంత్రం చాలా ఫ్యామిలీస్ బయటికి వచ్చాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం రావడంతో పరుగులు తీశారు. అత్యధికంగా బన్సీలాల్ పేట్ లో 8.75 సెంటీ మీటర్లు, పాటిగడ్డలో 8.53, సరూర్ నగర్ లో 8.35, ముషీరాబాద్ లో 8.05, హిమాయత్ నగర్ 6.95, సైదాబాద్ 6.88, ఆర్సీపురం 6.88, కూకట్ పల్లి 6.65, బేగంపేట్‌లో 6.50, ఖైరతాబాద్‌లో 6.30 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
నీట మునిగిన మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్
రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ఏరియాల్లో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ లో నిలిచిన వర్షపు నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది మోటార్ల సహాయంతో తోడేశారు. సికింద్రాబాద్, మియాపూర్, గచ్చిబౌలి, కోఠి, ఉప్పల్, లక్డీకాపూల్, రాజ్ భవన్, బేగంపేట్ ఫ్లైఓవర్, హిమాయత్ నగర్, మెహిదీపట్నం, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
హైటెక్స్ మెటల్ చార్మినార్ కమాన్ వద్ద రోడ్డుపై భారీగా నీరు చేరడంతో సైబర్ టవర్స్ నుంచి కొత్తగూడ రూట్ లో వెహికల్ మూవ్ మెంట్ స్లోగా సాగింది. నానక్ రాంగూడ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గచ్చిబౌలి జంక్షన్, శిల్పా లేఔవుట్ ఫ్లై ఓవర్ మీదుగా ఐకియా వరకు. ఫిలింనగర్, జూబ్లీహిల్స్ తదితరచోట్ల ట్రాఫిక్ నిలిపోయింది. బేగంపేట్ లోని ఓ పెట్రోల్ బంక్ లో నీళ్లు చేరాయి. వనస్థలిపురంలో విజయవాడ జాతీయ రహదారిపై చింతలకుంట వద్ద భారీగా వరద నీరు చేరడంతో కొన్ని కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పలుప్రాంతాల్లో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది.
అధికారులు అలర్ట్‌గా ఉండాలి: మంత్రి పొన్నం
హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, విద్యుత్ ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు.
నగరంలోని 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పాత భవనాల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయించాలని ఆదేశించారు. కరెంట్ పోల్స్ వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.