- పంజాగుట్ట, నిజాంపేటలో పిడుగుపాటు
- నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
- నేలకొరిగిన కరెంట్‌స్తంభాలు.. కూలిన చెట్లు
- చెరువులను తలపించిన గ్రేటర్రోడ్లు
- వానలో తడుస్తూనే ఆఫీసులకు వెళ్లిన ఉద్యోగులు
గ్రేటర్‌సిటీ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అత్యధికంగా సరూర్‌నగర్‌లో 13.23 సెంటీమీటర్ల వాన పడింది. ఈ మాన్సూన్సీజన్లో ఇదే అత్యధిక వర్ష పాతమని అధికారులు తెలిపారు. దాదాపు గంటల పాటు నాన్‌స్టాప్‌గా వర్షం పడడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
రోడ్లు చెరువులను తలపించాయి. వరద ప్రవాహానికి ఇండ్ల ముందు పార్క్చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. పంజాగుట్ట, నిజాంపేటలో పిడుగులు పడ్డాయి. చాలాచోట్ల చెట్లు కూలాయి. కరెంట్‌స్తంభాలు నేలకొరిగాయి. కార్లు, బైకులు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. మూసీ నదికి వరద పెరగడంతో ప్రమాదకరంగా మారింది. ముసారాంబాగ్ వద్ద బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తోంది. - సిటీ నెట్ వర్క్, వెలుగు
మెట్రోలో ఒకే రోజు ఐదున్నర లక్షల మంది ప్రయాణం
భారీ వర్షాల కారణంగా మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5.5 లక్షల మంది ప్రయాణించారు. రెగ్యులర్ గా 5లక్షల నుంచి 5లక్షల10వేల మంది ప్రయాణిస్తుంటారు. వాన కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకుంటామనే భయంతో మంగళవారం చాలా మంది సొంత వాహనాలను పక్కన పెట్టి మెట్రో ఎక్కారు. నాలుగైదు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మెట్రోకు ప్రయాణికుల తాడికి మరింత పెరిగే అవకాశం ఉంది.
టోలిచౌకి చౌరస్తాలో బ్లాక్..
టోలిచౌకి, నదీమ్ కాలనీ, నాలాల్ నగర్, లంగర్ హౌస్, గోల్కొండ, గుడిమల్కాపూర్, మల్లేపల్లి, జియాగూడ ప్రాంతాలను వరద ముంచెత్తింది. టోలిచౌకి చౌరస్తా, నదీమ్ కాలనీలోని రోడ్లు జలమయం అయ్యాయి. టోలిచౌకి రూమాన్ హోటల్వ్యర్థాల కారణంగా డ్రైనేజీ బ్లాక్ అవుతోందని కార్వాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి రోడ్డుపై వ్యర్థాలు పోస్తే హోటల్ ను క్లోజ్చేయిస్తామని యజమానిని హెచ్చరించారు. స్థానిక కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈదురు గాలులకు 7 టూమ్స్ వద్ద భారీ చెట్టు కూలింది. డీఆర్ఎఫ్ టీమ్చెట్టును తొలగించింది.
ఉద్ధృతంగా ఈసీ, మూసీ
చేవెళ్ల శంకర్పల్లి మండల పరిధిలోని ఈసీ, మూసీ ఉద్ధృతంగా పారుతున్నాయి. అనంతగిరి నుంచి భారీగా వరద వస్తోంది. హిమాయత్‌సాగర్ జలాశయంలోకి వరద పెరిగింది. వర్షానికి జవహర్ నగర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్యోతి కాలనీలోని ఓ ఇంట్లోకి పాము వచ్చింది. స్థానికుల సమాచారంతో స్నేక్క్యాచర్వచ్చి పట్టుకున్నారు.
రెండు చోట్ల పిడుగులు
నిజాంపేట మధురానగర్శ్రీ ఉన్నతి హైట్స్సాయిబాలాజీ రెసిడెన్సీపై పిడుగు పడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అపార్ట్మెంట్లోని వస్తువులు, ఎలక్ట్రానిక్వస్తువులు దగ్ధమయ్యాయి. చింతల్ వాజ్పేయినగర్ కు వరద పోటెత్తింది. ముషీరాబాద్ లోని పార్సిగుట్ట, ఆదర్శ్ కాలనీ, చర్చి కాలనీలు జలమయమయ్యాయి. బైకులు, కార్లు, ఆటోలు కొట్టుకుపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఓ కారు కొట్టుకువచ్చింది.
కూలిన ఎల్బీ స్టేడియం స్కేటింగ్రింక్వాల్
ఎల్బీ స్టేడియంలోని స్కెటింగ్ రింక్ వాల్ కూలింది. దాన్ని ఆనుకుని ఉన్న భారీ చెట్టు నేలకొరింది. వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరో మూడు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని షాపుల్లోకి వర్షపు నీరు, బురద చేరింది.
మ్యాన్ హోల్స్తెరవద్దు: అధికారులు
వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోల్స్ గుర్తించి మురుగు పొంగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని నగర పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఎర్రమంజిల్ కాలనీలోని శాంతి సౌధ అపార్టుమెంట్ ప్రహరీ కూలిపోయింది. గోడకు ఆనుకుని ఉన్న భారీ చెట్టు నేలకొరిగింది. పంజాగుట్టలోని సుఖ్‌నివాస్ రెసిడెంట్స్ అపార్ట్‌మెంటుపై పిడుగు పడింది. ఆరో అంతస్తు రైలింగ్ పెచ్చులూడాయి. ఓ కారుపై దెబ్బతింది.
సాయంత్రం మరోసారి కుండపోత
మంగళవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మరోసారి వర్షం దంచికొట్టింది. ఖైరతాదాబద్ లో 6.03 సెంటీమీటర్లు కురిసింది. అమీర్‌పేటలో 5.50, బాలానగర్ లో 5.10, ఆర్సీపురంలో 4.40 సెంటీమీటర్లు వార పడింది. రెండు గంటల వ్యవధిలో భారీ వర్షం కురడంతో ఆఫీసులు, పనులు ముగించుకుని ఇండ్లకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.
తెల్లవారుజాము 4 నుంచి 8 గంటల వరకు వర్షపాతం
ప్రాంతం వర్షపాతం
(సెం.మీ.లలో)
- సరూర్ నగర్ 13.23
- ఖైరతాబాద్ 12.68
- ఉప్పల్ 12.50
- రాజేంద్రనగర్ 12.28
- వెస్ట్ మారేడ్‌పల్లి 11.33
- బహదూర్ పురా 11.28
- గోల్కొండ 11.0
- నాంపల్లి 10.60
- కుత్బుల్లాపూర్ 10.40
- కంటోన్మెంట్ 10.30
- డబీర్ పురా 10.23
- ముషీరాబాద్ 10.08
- ఆసిఫ్ నగర్ 8.98
- ఆర్సీపురం 8.88
- చర్లపల్లి 8.80
- బండ్లగూడ 8.75
- షేక్ పేట 8.75