హైదరాబాద్లో భారీ వర్షం.. బయటకు రావొద్దు.. జీహెచ్ఎంసీ హెచ్చరిక

హైదరాబాద్లో భారీ వర్షం.. బయటకు రావొద్దు.. జీహెచ్ఎంసీ హెచ్చరిక

భాగ్యనగరంలో మరోసారి వరుణుడు బీభత్సం సృష్టించాడు. మే 09వ తేదీ మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. రోడ్లపై ఎక్కడికక్కడ వాననీరు  చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకస్మిక వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  

భారీ వాన

మే 9వ తేదీ మంగళవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. దీని కారణంగా కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఎస్సార్ నగర్,  ఐఎస్‌ సదన్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌,సరూర్ నగర్, చంపాపేట్, సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్ పేట్, చాదర్‌ఘాట్, కోఠి వంటి  తదితర ప్రాంతాల్లో భారీ భారీ వర్షం కురిసింది.  ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. 

హెచ్చరిక

హైదరాబాద్లో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని  సూచించారు. భారీ వర్షం నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. 

మోచా తుపాను ప్రభావం..

అగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని భారతవాతావరణ కేంద్రం ప్రకటించింది.  అగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో  మే 10 నాటికి మోచా తుపానుగా బలపడుతుందని వెల్లడించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా మే 11 వరకు కదిలి తర్వాత దిశ మార్చుకుని ఉత్తర -ఈశాన్య దిశగా బంగ్లాదేశ్ -మయన్మార్ తీరం వైపు వెళ్తుందని పేర్కొంది. ఉపరితల ద్రోణి తెలంగాణ నుంచి తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.