- కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వడ్లు
- చేతికొచ్చిన పంట నీళ్లపాలవుతుంటే బోరుమంటున్న రైతులు
కరీంనగర్, జగిత్యాల, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి, సోమవారం కురిసిన కుండపోత వర్షానికి రైతులకు మరోసారి నష్టం కలిగింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ రూరల్ , గంగాధర, కొత్తపల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాలన్నీ జలమయమై చిన్నపాటి చెరువులను తలపించాయి. కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పలు తడిచిపోయాయి. గంగాధర మండలం వెంకటాయపల్లి, గర్శకుర్తిలో వరికుప్పల్లోకి వరదనీరు చేరి వడ్లు కొట్టుకుపోయాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ తోపాటు పలు గ్రామాల్లోని వడ్ల కొనుగోలు సెంటర్లలో వరద నీరు చేరింది. చేతికి వచ్చిన పంట అక్కరకు రాకుండా పోతుంటే రైతులు బోరుమంటున్నారు.
కొనుగోలు సెంటర్లు ప్రారంభించి 15 రోజులు అయినప్పటికీ కనీసం 10శాతం వడ్లు కూడా కొనుగోలు చేయలేదు. వడ్లు పూర్తిగా తడిసిపోవడంతో కొనుగోళ్లు బంద్ అయ్యాయి. పెద్దపల్లి జిల్లా నారాయణరావు పల్లె శివారులోని పంట నష్టాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. కనుకుల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు రైతులను పరామర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, కథలాపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. కోరుట్లలోని సాయిబాబా ఆలయం పక్కనున్న కొనుగోలు కేంద్రంలో వడ్లు తెచ్చి 10 రోజులు దాటినా ఇప్పటికి కొనుగోలు ప్రారంభించలేదని రైతులు వాపోతున్నారు. మెట్పల్లి మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. జగ్గసాగర్, బండలింగపూర్, వెల్లుల్ల, వేంపేట, రామలచ్చక్కపేట, మెట్లచిట్టపూర్ గ్రామాలలో కురిసిన వర్షానికి వడ్లు తడిసిపోయాయి.