- రైతులకు తీరని నష్టం
- 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
ములకలపల్లి, వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. సుమారు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షంతో రైతులకు తీరని నష్టం ఏర్పడింది. అమ్మడానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం కళ్లముందే వరద నీటిలో కొట్టుకుపోతుంటే రైతులు ఏమీ చేయని స్థితిలో ఉండిపోయారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతోపాటు కల్లాల్లోనూ ధాన్యాన్ని ఆరబోశారు. ఒక్కసారిగా దంచి కొట్టిన భారీ వర్షానికి ధాన్యం తడిసింది. జీవన్ జ్యోతి స్కూల్ సమీపంలో అంబేద్కర్ నగరకు చెందిన ఖమ్మం పాటి దుర్గాప్రసాద్ తన 8 ఎకరాల ధాన్యమంతా ఆరబోయగా వరదకి తడిసింది.
గొడ్ల చిన్న కొండయ్య, తాళ్లూరి వెంకటేశ్వర్లు, తాళ్లూరి బాబు, మిరియాల కృష్ణయ్య, ఎనగళ్ల సత్యం, బైరు సాయి,షేక్ మౌలాలి, కారుమంచి శ్రీను, పసుపులేటి వెంకటపతి సురటి రాజు, బైరు ప్రసాద్, గొడ్ల రాజుల సుమారు 200 ఎకరాల్లో పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. కొందరి రైతుల వడ్లు వరదకు కొట్టుకుపోయాయి. వీరిలో కొందరికి సొసైటీ నిర్వాహకులు కూపన్లు ఇచ్చినా కాంటాలు వేయకపోవడంతో వర్షంతో దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం తడవకుండా వ్యవసాయ శాఖ కనీసం పట్టాలు కూడా అందించడంలేదన్నారు. ఏడీఏ అఫ్జల్ బేగం, ఏవో కరుణామయి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.