- 3 గంటల్లోనే 27 సెం.మీ వర్షపాతం నమోదు
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- వందల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
సిద్దిపేట/కోహెడ,వెలుగు : సిద్దిపేట జిల్లా కొహెడలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు కుండపోత వాన పడింది. మూడు గంటల్లోనే 27 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. షాపులు, ఇండ్లలోకి వరద నీరు చేరింది. రోడ్లపై నడుము లోతు నీరు నిల్వడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎనిమిది ఇండ్లు కూలిపోగా, ఒక బర్రె చనిపోయింది. కొహెడ మండలంలో వందల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగిపోయాయి.
బస్వాపూర్ వద్ద మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రహిస్తుండటంతో సమీపంలోని ఇండ్లలోకి వరద చేరింది. బాధితులను స్థానిక ప్రభుత్వ స్కూల్ లోకి తరలించారు. జాతీయ రహదారి పనులు చేయడానికి వచ్చిన ఎనిమిది మంది యూపీ కూలీలు ఓ ఇంట్లో చిక్కుకున్నారు. సమాచారం అందడంతో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ రెస్క్యూ టీమ్ తో వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మండల పరిధిలోని పలు రోడ్లు దెబ్బతిన్నాయి.