వర్ష బీభత్సం..ఇవి కాలనీలా..! లేక చెరువులా..!

నిజమాబాద్  జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. అర్ధరాత్రి వేల్పుర్, పెర్కిట్, భీంగల్, జక్రాన్ పల్లి, కోర్ ట్ పల్లిలో రికార్డు స్థాయిలో వాన పడింది. వేల్పుర్లో అత్యధికంగా 46 సెంటిమీటర్లు, పెర్కిట్ లో 33, భీంగల్ లో 26, జక్రాన్ పల్లి లో 22 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది.  రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. ఈ సీజన్ లోనే అతి భారీ వర్షం కురిసిందని రైతులు చెబుతున్నారు. 

భారీ వర్షాలకు  వేల్పూర్-సాహెబ్ పెట్ గ్రామాల మధ్య కల్వర్టు  తెగిపోయింది. దీంతో  రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూర్ మసర్ కుంట చెరువు కట్ట తెగడంతో ఆర్మూర్ భీంగల్ రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది
 అటు ఆర్మూర్ నియోజకవర్గంలోని పలుచోట్ల రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. బీభత్సమైన వానకు లోతట్టు కాలనీలోకి వాన నీరు చేరింది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.