- జలమయమైన లోతట్టు ప్రాంతాలు
- భీంగల్‌లో 103 ఎంఎం, ఇందూర్లో 83.5 ఎంఎం
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకధాటిగా వాన దంచికొట్టింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. భీంగల్ మండలంలో అత్యధికంగా 103.8 ఎంఎం వర్షం కురవగా, ఇందూర్ సౌత్ మండలంలో 83.5, నార్త్‌లో 73.3 ఎంఎం వర్షపాతం నమోదైంది. కమ్మర్పల్లి మండలం కోనసముందర్‌లో 73.3, నిజామాబాద్ మండలం గోపన్‌పల్లిలో 59.5, మెండోరాలో 46.0 ఎంఎం, బోధన్ మండలం బెల్లాల్లో 45.3, ఎడపల్లిలో 41.3, జాన్కంపేటలో 36.5, నందిపేట మండలం
సీహెచ్కొండూర్లో 29.0 ఎంఎం, ఇందల్వాయి మండలం గన్నారంలో 28.0, బాల్కొండలో 22.8, డొంకేశ్వర్ తొండాకూర్‌లో 16.5 ఎంఎం వర్షం కురిసింది. వేల్పూర్, ముగ్పాల్ మండలాల్లో 15 ఎంఎంల వర్షం పడగా, ఎర్గట్లలో 14.8, జక్రాన్‌పల్లిలో 11.8, నవీపేట11,3, మాక్లూర్ మదన్‌పల్లిలో 11.0 ఎంఎం, ముప్కాల్ మండలంలో 9.0, మోర్తాడ్ 8.3, ఆర్మూర్ మాగిడిలో 7.3, కమ్మర్పల్లి, సాలూరా మండలాల్లో 5.5, సిరికొండ, డిచ్పల్లి, రెంజల్లో 4.0 ఎంఎం వర్షం కురిసింది.
వరద నీళ్లలో చిక్కుకున్న బస్సు
స్థానిక కంఠేశ్వర్ రైల్వే కమాన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కింద వాననీళ్లలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. మద్యాహ్నం వరంగల్ నుంచి వస్తున్న బస్సు రైల్వే అండర్ బ్రిడ్జి కింద ఐదడుగులకు పైగా చేరిన నీటిలో మునిగింది. బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులను పోలీసులు, స్థానిక యువకులు బస్సులో నుంచి దింపి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నీళ్లలో చిక్కుకున్న బస్సును జేసీబీ సాయంతో బయటకు తీసి డిపోకు తరలించారు. నగరంలో దంచికొట్టిన వాన లోతట్టు ఏరియాలపై తీవ్ర ప్రభావం చూపింది.
నటరాజ్ టాకీస్ వెనక వైపు కాలనీల్లోని ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. బోధన్ వెళ్లే మెయిన్‌రోడ్డుపై అర్సాపల్లి వద్ద నాలుగు ఫీట్ల మేర వరద పారింది. అటుగా వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్ పక్కనున్న షాపుల్లోకి వరద నీరు చేరడంతో దుకాణాలు మూసేశారు. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్‌లో భారీగా వరద నీరు చేరింది. శివారు కాలనీలన్నీ జలమయమయ్యాయి.