మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జనానికి కాస్త రిలీఫ్ దక్కింది. రాజమండ్రిలో ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.భారీ వర్షానికి రహదారులన్నీ జలమయం కాగా,లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. బైకులు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. గత కొద్ది రోజులుగా మండే ఎండలతో అల్లాడిన నగరవాసులు ఈ వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీతో పాటు తెలంగాణాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నట్లు సమాచారం అందుతోంది.రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో విపత్తు నివారణ సంస్థ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్లు, టవర్స్, పోల్స్,పొలాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని తెలిపింది.అయితే, అకాల వర్షానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల గోడౌన్లలో ఉంచిన ధాన్యం వర్షంలో తడిసింది.