సౌదీ అరేబియాలో కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన కార్లు.. మునిగిపోయిన ఇళ్లు

సౌదీ అరేబియాలో కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన కార్లు.. మునిగిపోయిన ఇళ్లు

సౌదీ అరేబియా అనగానే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఎడారి ప్రాంతం అని.. లేదా మక్కా, మదీనా ప్రార్థన మందిరాలు.. ఇప్పుడు సౌదీ అరేబియా అలా లేదు.. ఎక్కడ చూసినా నీళ్లు.. మునిగిపోయిన ఇళ్లు.. కొట్టుకుపోయిన కార్లు.. ఇదీ ఇప్పుడు సౌదీ అరేబియా పరిస్థితి. 2025, జనవరి 6వ రాత్రి నుంచి 7వ తేదీ ఉదయం వరకు సౌదీ అరేబియాలో కుండపోత వర్షం పడింది.. వడగళ్లు పడ్డాయి.. ఉరుములు, మెరుపులతో ఆకాశం బీభత్సం.. వందల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. సౌదీ మొత్తాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.

ఎడారి దేశం సౌదీ అరేబియాను కుండపోత వర్షం ముంచెత్తింది. 2025, జనవరి 6వ రాత్రి నుంచి 7వ తేదీ ఉదయం వరకు ఊహించని రేంజ్‎లో కురిసిన వానతో సౌదీ సముద్రాన్ని తలపించింది. సౌదీలో ముఖ్య నగరాలు మక్కా,  మదీనా, జెడ్డాతో పాటు గవర్నరేట్‌లోని ఇతర ప్రాంతాలలో వడగళ్ళు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా సౌదీలోని పలు నగరాలు వరదలతో నీట మునిగాయి. రోడ్లు నదులను తలపించాయి. కుండపోత వర్షాలతో సౌదీలో జనజీవనం స్థంభించిపోయింది. ఈ ఆకస్మిక వర్షాల వల్ల ముఖ్యంగా అల్ ఉలా, అల్-మదీనా ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.

అల్-మదీనాలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన మస్జిద్-ఎ-నబవి కూడా వర్షాల కారణంగా ముంపునకు గురైంది. మసీదు లోపలికి వరద నీరు చేరింది. మసీదును వర్షపు నీరు ముంచెత్తిన చేరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో వరదల్లో బైకులు, కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోగా.. మరికొన్ని ఏరియాల్లో  వర్షపు నీటితో ఇళ్లు మునిగిపోయాయి. వరదల్లో వాహనాలు కొట్టుకుపోయిన వీడియోలు నెట్టింట వైరల్‎గా మారాయి. ఏడాది దేశంలో వరుణుడి సృష్టించిన ఈ బీభత్సం వల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.

 

 

వరుణుడి బీభత్సంతో సౌదీ పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా మారింది. సౌదీలో మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని.. రానున్న 48 గంటల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వెదర్ డిపార్మెంట్ హెచ్చరికలతో సౌదీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రానున్న రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అత్యవసరం అయితేనే ఇండ్ల నుండి బయటకు రావాలని ప్రజలకు సూచించింది. 

ALSO READ | అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను..ఏడు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచన చేసింది. వరదల్లో ఇళ్లు మునిగిపోయిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేసింది. ఆకస్మిక వర్షాల వల్ల సౌదీకి అపార నష్టం వాటిల్లిందని ప్రభుత్వం పేర్కొంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా స్పందించేందుకు అత్యవసర సేవలు సిద్ధంగా ఉన్నాయని ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ధైర్యం చెప్పింది.