కూల్​ కూల్​ గా హైదరాబాద్​.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షాలు

కూల్​ కూల్​ గా హైదరాబాద్​.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షాలు

 హైదరాబాద్‌లో(Telangana Capital Hyderabad) వాతావరణం(Weather) ఒక్కసారిగా మారింది. ఇప్పటి వరకు ఎండ దంచికొట్టగా.. ఇప్పుడు వాతావరణం చల్లబడింది. మేఘావృతమైన వర్ష సూచన(Rain Alert to Hyderabad) కనిపిస్తోంది. భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. నల్లటి దట్టమైన మేఘాలు నగర వ్యా్ప్తంగా ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది.

హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం చల్లబడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లిలో భారీ వర్షకురుస్తోంది.

జీహెచ్ఎంసీ అలర్ట్..

భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆయా విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో అలర్ట్‌గా ఉన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలకుండగా, రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా.. చెట్లు, హోర్డింగ్స్ కూలిపోతే వెంటనే తొలగించేలా అధికారులు సమాయత్తం అయ్యారు. మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు బల్దియా అధికారులు. 040-21111111, 9000113667 నెంబర్లను ప్రకటించారు. ప్రజలు తమ తమ ప్రాంతాల్లో ఏమైనా సమస్యలుంటే వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేసి సమాచారం తెలియజేయాల్సిందిగా అధికారులు తెలిపారు.


తెలంగాణ జిల్లాల్లో వర్షం

తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలకరి పలకరించింది. బజార్ హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ తదితర మండలాల్లో వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో ఒక్క సారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని మొఖాసిగూడ గ్రామంలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో పలు ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ వృక్షం విరిగిపడింది. ఉరుముల ,మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఎండవేడిమి, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఈదురు గాలులు పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల పిడుగు పాటుకు చెట్లు నేలరాలాయి .