ఉదయం ఎండ.. సాయంత్రం వాన ..

ఉదయం ఎండ.. సాయంత్రం వాన ..
  • వరంగల్​లో కుండపోత     
  • రోడ్లపై నడుములోతు పారిన వరదనీరు
  • కొట్టుకుపోయిన పార్కింగ్ కార్లు, బైక్ లు 

వరంగల్, వెలుగు :  వరంగల్ కుండపోత వాన పడింది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా దంచికొట్టింది. ఉదయమంతా ఎండ కొట్టగా.. సాయంత్రం నల్లని మబ్బులు కమ్మేశాయి.  ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం కురిసింది. రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని స్థాయిలో వాన పడింది. ఆఫీసులు, షాపింగ్ లు, వివిధ పనులపై బయటకు వచ్చిన ప్రజలు పార్కింగ్​చేసిన కార్లు, బైక్ వరదలో మునిగి కొట్టుకుపోయాయి.  

స్కూళ్లు, ఆఫీసులు వదిలే సమయం కావడంతో పిల్లలు, తల్లిదండ్రులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ అంబేడ్కర్​భవన్​మెయిన్​రోడ్​పై నడుములోతు వరద పారింది. అంబేడ్కర్​భవన్​లో ఓ పెండ్లికి వచ్చిన అతిథులకు చెందిన వాహనాలు కొట్టుకుపోతున్నాయని తెలియడంతో బయటకు పరుగులు తీశారు. కార్లు, బైక్ లను వరదలోంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు సిటీ జనాలకు వాన చుక్కలు చూపించింది.