ఉప్పొంగిన వాగులు, వంకలు..స్తంభించిన రవాణా

  • హనుమకొండ - భూపాలపట్నం జాతీయ రహదారిపై రాకపోకలు బంద్
  • గోవిందరావుపేట మండలం పస్రా- తాడ్వాయి మధ్య 163 హైవే పై కొట్టుకుపోయిన రోడ్డు
  • పస్రా -తాడ్వాయి మధ్య రాత్రి నుంచి కిలోమీటర్ల మేర నిలిచి పోయిన వాహనాలు
  • రాత్రి నుంచి వర్షం చీకటిలో లారీ డ్రైవర్లు
  • జలగలంచ వాగు వద్ద తగ్గిన వరద.. తెగిన రోడ్డు, ధ్వంసమైన రైలింగ్

వెలుగు నెట్​ వర్క్: ఉమ్మడి జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. వారం రోజుల గ్యాప్ అనంతరం వానలు మళ్లీ బీభత్సం సృష్టించాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ జిల్లాకేంద్రంలో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. పెంబర్తి సమీపంలోని జిల్లా రవాణా శాఖ ఆఫీస్ నీటిలో మునిగింది. అటు లింగాల ఘనపూర్ మండలంలోని చీటూరు పెద్దవాగు, గోకు వాగు ఉప్పొంగడంతో.. రెండు వాగుల మధ్య 14మంది కూలీలు చిక్కుకున్నారు. చీటూరు శ్మశానవాటికలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో ఉగ్రరూపం..
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో గుంజేడు, గాదె వాగులు ఉగ్రరూపం దాల్చాయి. కొత్తపల్లి, భూర్కపల్లి, మొండ్రాయిగూడెం, వేలుబెల్లి కత్తెర్ల గ్రామాల్లోనూ వాగులు ప్రవహిస్తున్నాయి. దంతాలపల్లి, నర్సింహులపేట, తొర్రూరు, మరిపెడ మండలాల్లో జడివాన కురిసింది. ఆకేరు, పాలేరు వాగులు ఉప్పొంగుతున్నాయి. సమీప కల్వర్టులు తెగిపోయాయి. మూడు మండలాల్లో రవాణా స్తంభించింది. గవర్నమెంట్ ఆఫీసులతో పాటు పలు స్కూళ్లు నీటిలో మునిగాయి. చెరువులన్నీ మత్తళ్లు పోస్తున్నాయి. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామ సమీపంలో లోలెవల్ కాజ్ వే వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో తొర్రూరు మండలం నుంచి వస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకుంది. స్థానికులు బస్సులోని స్టూడెంట్లను కాపాడారు. మరిపెడ మండలం కోట్య తండా పరిధిలోని చౌళ్ల తండాకు చెందిన 20మంది కూలీలు సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం జి.కొత్తపల్లి గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్లారు. పాలేరు వాగు ఉధృతి పెరగడంతో బయటకు వెళ్లే మార్గం లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పస్రా– -తాడ్వాయి మధ్య తెగిన రోడ్డు..
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా... తాడ్వాయి మండలం లవ్వాల క్రాస్ మధ్య నేషనల్ హైవే తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులతోపాటు సుమారు 200 ప్రైవేటు వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. తాడ్వాయి వైపు కూడా పదుల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పస్రా నుంచి ఏటూరునాగారం, మంగపేట, మేడారం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. గోవిందరావుపేట మండలం వెంగళాపూర్ సమీపంలో వాగు ఉప్పొంగడంతో ఆ రూట్​  కూడా బంద్ అయింది. దీంతో వెహికల్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.