జోరు వానకు హైదరాబాద్ మహా నగరం తడిసి ముద్దవుతోంది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం.. మంగళవారం తెల్లవారుజామున మరోసారి ముంచెత్తింది. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, కూకట్ పల్లి, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా ప్రధాన ఏరియాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.
ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి నగర రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో రోడ్లపై మోకాలిలోతు వరకు వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. సహాయ సేవలు కోసం 040-21111111, 9000113667 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
మరో రెండు గంటలు భారీ వర్షం
నగరంలో మరో రెండు గంటల పాటు భారీ వర్షం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.