హైదరాబాద్​లో దంచికొట్టిన వాన.. ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం

హైదరాబాద్​లో దంచికొట్టిన వాన..  ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం
  • గోల్కొండలో విరిగిపడిన 200 ఏండ్ల నాటి చెట్టు
  • రోడ్లపైకి నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్
  • అత్యధికంగా గోల్కొండలో5.80 సెంటీ మీటర్ల వాన
  • ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. గోల్కొండ లోని ఎండీ లైన్స్​లో దాదాపు 200 ఏండ్ల నాటి చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు కాగా, నాలుగు బైకులు ధ్వంసం అయ్యాయి. మధ్యాహ్నం నుంచే హైదరాబాద్ సిటీలోని పలు చోట్ల వర్షం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

గోల్కొండలో అత్యధికంగా 5.80 సెంటీ మీటర్ల మేర వర్షం పడింది. సిటీ రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వరద ప్రవాహానికి కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మధురానగర్, కొత్తపేట్, ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్, హైదర్ నగర్, డబీర్ పురా, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కూలిన చెట్లను జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించాయి.

జీహెచ్​ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ

వర్షం కారణంగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హెల్ప్ లైన్ నంబర్ కి వందకు పైగా కాల్స్ వచ్చాయి. వర్షపు నీరు చేరిందని, చెట్లు విరిగిపడ్డాయని, కరెంట్ సప్లై ఆగిపోయిందంటూ సిటీ వాసులు బల్దియాకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా, డీఆర్ఎఫ్ టీమ్స్​కి కూడా మరో 30 వరకు ఫిర్యాదులు అందాయి. కాగా, బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు ఉండటంతో ఉన్నతాధికారులు ఫీల్డ్ లోకి రాలేదు. కేవలం కొంత సిబ్బంది మాత్రమే కనిపించారు. సర్కిల్, జోనల్ స్థాయిలో ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అత్యవసరమైతే హైల్ప్ లైన్ నంబర్ 040–-21111111, డీఆర్ఎఫ్ బృందాల సాయం కోసం 90001 13667 నంబర్​ను సంప్రదించాల్సిందిగా అధికారులు తెలిపారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: పొన్నం

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం పడటంతో జిల్లా ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఇన్​చార్జ్ కమిషనర్ అమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్లు, పలువురు ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. 

జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్ వర్క్స్, విద్యుత్, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఎవరూ నిరక్ష్యంగా ఉండొద్దన్నారు. అందరూ విధుల్లో ఉండాలని సూచించారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్లలో ప్రత్యేక సిబ్బందిని ఉంచి నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వర్షానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేయాలని హైదరాబాద్ సీపీకి మంత్రి సూచించారు. ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో నామ మాత్రపు వర్షం పడిందని, పెద్దగా ఇబ్బందుల్లేవని అధికారులు మంత్రికి వివరించారు. చెట్లు పడిన ప్రాంతాల్లో వెంటనే వాటిని తొలగించామని చెప్పారు.