ఏపీలో రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

ఏపీలో రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

అమరావతి: అల్పపీడనం కారణంగా రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సముద్ర మట్టానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఆవర్తనం విస్తరించి ఉందని ఆయన వెల్లడించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు.

డిసెంబర్ 18, బుధవారం రోజు విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా,  శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు  వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ALSO READ | యువ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

డిసెంబర్ 19న (గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నెల్లూరు, పార్వతీపురంమన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.