నేరడిగొండ మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం

నేరడిగొండ , వెలుగు: నేరడిగొండ మండలంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో పాటు ఉరుములు,  మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్​తీగలు తెగిపడిపోయాయి.  దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  భారీ వర్షానికి పలు గ్రామాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కరెంట్ షాక్​తో మేకలు మృతి

కరెంట్ షాక్ తగిలి  9 మేకలు మృతి చెందిన ఘటన నేరడిగొండ మండలంలో జరిగింది. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆడేం అర్జున్ అనే రైతుకు దాదాపు 60 మేకలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఆయన మేకలను మేతకు తీసుకెళ్లాడు. భారీ ఈదురుగాల కారణంగా నాగ మల్యాల నుంచి లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో 11 కేవీ కరెంట్ తీగలు తెగి కిందపడిపోగా.. అర్జున్ మేకలను మేతకు తీసుకెళ్తున్న క్రమంలో కిందపడి ఉన్న కరెంట్ తీగలతో మేకలకు షాక్ తగిలింది. ఈ ఘటనలో 9 మేకలు చనిపోయాయి. దాదాపు రూ. లక్షకుపైగా నష్టం జరిగిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

అకాల వర్షం.. రైతన్నకు నష్టం

బోథ్: బోథ్ ​మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యం తడిసి రైతన్న నష్టపోయాడు. స్థానిక మార్కెట్ ​యార్డులో మార్క్​ఫెడ్​ఆధ్వర్యంలో చేపట్టిన జొన్నల కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకువచ్చిన పంట తడిసిపోయింది. పంట నిల్వ ఉంచడానికి సరిపడా షెడ్లు లేకపోవడంతో పాటు సంచులపై కప్పడానికి టార్పాలిన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో  ఆరుబయటనే రైతులు తమ పంటను నిల్వ ఉంచడంతో సంచులు తడిసిపోయాయి. తడిసిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరారు.