
- మూడు వేల ఎకరాల్లో పంట నష్టం
- భారీ వర్షానికి కూలిన 10 ఇండ్లు
సిద్దిపేట, వెలుగు : ఈదురు గాలులతో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షం సిద్దిపేట జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. జిల్లాలో దాదాపు 3700 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. 90 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, పది ఇండ్లు కూలిపోగా, వందల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 50 గ్రామాల్లో కురిసిన వడగండ్లకు 600 ఎకరాల్లో వరి, 1500 ఎకరాల్లో మొక్కజొన్న, వంద ఎకరాల్లో సన్ ఫ్లవర్, 300 ఎకరాల్లో కూరగాయల తోటలు,500 ఎకరాల్లో మామిడి తోటలు, 700 ఎకరాల్లో హార్టికల్చర్ తోటలకు నష్టం వాటిల్లింది.
దాదాపు వంద కోట్ల వరకు పంటల నష్టం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దుబ్బాక, బెజ్జంకి, చిన్నకోడూరు మండలాల్లో వరి, బెజ్జంకి, గజ్వేల్, రాయపోల్ మండలాల్లో మొక్కజొన్న, దుబ్బాక, బెజ్జంకి, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నంగునూరు మండలం దర్గపల్లిలో రాలిన మామిడి తోటలను జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పరిశీలించి నష్ట వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్టు వెల్లడించారు. చిన్నకోడూరు మండలంలోని మైలారం మధిర గ్రామం కొండేంగలకుంటలో పిడుగుపాటుకు ఓజయ్యకు చెందిన
రూ. 50 వేల విలువైన గేదె మృతి చెందింది. సిద్దిపేట పట్టణంలో దాదాపు వందకు పైగా చెట్లు నేలకూలాయి. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడటంతో సరఫరాకు ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్ రోడ్డులోని హోటల్ హోర్డింగ్, సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ప్రైవేటు కంపెనీ షెడ్, నాసర్ పురాలో మూడు, ఖాదర్ పురాలో రెండు ఇండ్ల పై కప్పులు కూలిపోగా, చిన్నకోడూరులో మెకానిక్ షెడ్ గాలికి ఎగిరిపోయింది. ఎకరం వరి పంట నేలపాలైంది
చింత లక్ష్మణ్, రైతు పొన్నాల , సిద్దిపేట అర్బన్ మండలం
వడగండ్ల వర్షంతో మరో నెల రోజుల్లో చేతికొచ్చే ఎకరం వరి పంట నేలపాలైంది. యాసంగి పంటతో అప్పులు తీర్చుకుందామంటే అకాల వర్షం మళ్లీ అప్పుల పాలు జేసింది. ఇప్పటివరకు ఎకరా పంటకు ఇరవై వేలు ఖర్చుపెట్టి సాగు చేశాను.