బెంగళూరులో రికార్డు వాన

బెంగళూరులో రికార్డు వాన
  • ఆదివారం ఒక్కరోజే 111 మి.మీ. వర్షపాతం

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో కుంభవృష్టి కురిసింది. ఆదివారం ఒక్కరోజే 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో 133 ఏండ్ల రికార్డును బ్రేక్​ చేసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బెంగళూరులోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శాస్త్రవేత్త ఎన్ పువియరాసన్ మాట్లాడుతూ.. శని, ఆదివారాల్లో 140.7 మి.మీ. వర్షం కురిసిందని తెలిపారు. అలాగే, ఆదివారం 111 మి.మీ. వర్షపాతం నమోదైందని, ఇది జూన్ నెల సగటు వర్షపాతం (110.3 మి.మీ.) ను ఒక్కరోజులోనే అధిగమించిందని చెప్పారు. 1891 జూన్ 16న ఒకే రోజు అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.

భారీ వర్షం కారణంగా బెంగళూరు సిటీ అస్తవ్యస్తమైంది. చెట్లు కూలిపోయి, వీధులన్నీ జలమయమై జనజీనవం పూర్తిగా స్తంభించిపోయింది. ట్రినిటీ మెట్రో స్టేషన్‌‌‌‌ సమీపంలోని మెట్రో ట్రాక్‌‌‌‌పై ఆదివారం రాత్రి చెట్టు కూలి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కాగా, బెంగళూరులోని ఐఎండీ సెంటర్ హెడ్ సీఎస్ పాటిల్.. ఈ నెల 5 వరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

కోస్తా కర్నాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ.. బాగల్‌‌‌‌కోట్, బెల్గావి, ధార్వాడ్, గడగ్, హావేరి, కొప్పల్, విజయపుర.. సౌత్​ ఇంటీరియర్ కర్నాటకలోని బళ్లారి, బెంగళూరు, చిక్కబల్లాపుర, దావణగెరె, చిత్రదుర్గ, హసన్, మైసూరు, తుమకూరులో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలావుండగా, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోమవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. త్వరలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు. శాసనమండలి ఎన్నికల అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి వర్షాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.