
ఖండ, సముద్ర భాగాలు ఉష్ణోగ్రతను గ్రహించడంలో ఉన్న మార్పుల వల్ల రుతుపవనాలు ఏర్పడతాయి. ప్రపంచ పవనాలైన ఆగ్నేయ రుతుపవనాలు దక్షిణాసియా ప్రాంతంలో రూపాంతరం చెంది నైరుతి రుతుపవనాలుగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు బంగాళాఖాతం, అరేబియా శాఖలుగా పిలుస్తారు. ఈ రుతుపవనాల మూలంగా 90 శాతం వర్షపాతం సంభవిస్తుంది. రుతుపవనాలు, భారత శీతోష్ణస్థితి గురించి హిందూ మహాసముద్రం ఆధారంగా తొలిసారిగా ఇరాక్ శాస్త్రవేత్త ఆల్మసూది చెప్పారు.
బంగాళాఖాతం శాఖ
దేశంలోకి తొలిసారిగా బంగాళాఖాతపు శాఖ ప్రవేశిస్తుంది. మే చివరి నాటికి అండమాన్ నికోబార్ దీవులకు చేరుకుంటుంది. ఆ తర్వాత ఇది బంగాళాఖాతం మీదుగా పయనించి అరకాన్యోమో పర్వతాల వల్ల మయన్మార్‌లో అడ్డగించబడి ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ వీటిని ఖాసీ కొండలు అడ్డుకుంటాయి. ఈ ప్రాంతంలో మాసిన్రామ్ వద్ద అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఆ తర్వాత బంగాళాఖాతం శాఖ హిమాలయాలు అడ్డగించడం వల్ల పంజాబ్ మీదికి వెళ్తుంది.
అరేబియా శాఖ
ఈ శాఖ మొదట నైరుతి దిక్కున జూన్ 1న కేరళను చేరుకొని కర్ణాటక, మహారాష్ట్ర, కలకత్తా మీదుగా పయనించి ఢిల్లీ చేరుకొని ఆ తర్వాత పంజాబ్ మీదకు వెళ్తుంది. అరేబియా సముద్రం మీదుగా ఈ శాఖ అధిక దూరం ప్రయాణించడంతో అరేబియా శాఖ మూలంగా అధిక వర్షపాతం సంభవిస్తుంది. బంగాళాఖాత శాఖ, అరేబియా శాఖలు పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా వద్ద కలుస్తాయి.
– భారతదేశంలో అధిక వర్షపాతం అరేబియా శాఖ వల్ల సంభవిస్తుంది. ఇది పర్వతీయ వర్షపాతానికి రకానికి చెందింది. తమిళనాడు, రాజస్తాన్, లఢఖ్ ప్రాంతాలు నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతం పొందవు.
– తమిళనాడు పశ్చిమ కనుమల వర్షచ్ఛాయ ప్రాంతంలో ఉండటం, బంగాళాఖాత శాఖ ద్వారా వీచే పవనాలు తమిళనాడు ప్రాంతానికి సమాంతరంగా కదలడం, రుతపవన గాలులు తమిళనాడు రాష్ట్ర భూభాగాన్ని చేరే నాటికి పొడి పవనాలుగా మారడంతో నైరుతి రుతుపవనాల వల్ల తమిళనాడు వర్షం పొందలేకపోతున్నది.
– రాజస్తాన్ రాష్ట్రం గుండా అరేబియా శాఖ రుతుపవనాలు కదులుతున్నా గాని తగినంత వర్షపాతం సంభవించదు. ఎందుకంటే ఆరావళి పర్వతాలు రుతుపవన గాలులు వీచే దిశకు సమాంతరంగా ఉండటం, రుతుపవన గాలులు రాజస్తాన్ భూభాగం చేరే సమయానికి వాటిలో ఉన్న తేమ శాతం తగ్గిపోవడం, హిమాలయ పర్వత వ్యవస్థ రాజస్తాన్ భూభాగానికి దూరంగా ఉండటం వల్ల వర్షం పొందలేకపోతున్నది.
– లఢఖ్ ప్రాంతం హిమాలయ వ్యవస్థ వర్షచ్ఛాయ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం నైరుతి రుతుపవనాల వల్ల తగిన వర్షపాతం పొందలేకపోతున్నది.
ఈశాన్య రుతుపవనాలు
సెప్టెంబర్ మధ్య నుంచి సూర్యుడు దక్షిణార్థ గోళంలోకి ప్రవేశించడంతో భారత్‌లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. భారత భూభాగంపై విస్తరించిన అల్పపీడనం క్షీణించి అధిక పీడనం బలపడుతుంది. ఈ విధంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. తిరోగమించిన ఈ రుతుపవనాలు శుష్కంగా ఉంటాయి. కానీ ఇవి బంగాళాఖాతంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి తేమను పీల్చుకొని ఆర్ధ్రంగా మారతాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో వీస్తున్న ఈశాన్య రుతుపవనాలు, తిరోగమన నైరుతి రుతుపవనాలు కలిసి ఈశాన్య రుతుపవనాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ రుతుపవనాల వల్ల తమిళనాడు రాష్ట్రం అధిక వర్షపాతం పొందుతుంది. ఇందుకు షెవరాయ్ కొండలు సహకరిస్తాయి.
ప్రభావిత అంశాలు
ఎల్‌నినో: ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్రంలోని పెరూ తీర ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత మూలంగా అక్కడ అధిక స్థాయిలో అల్పపీడన స్థితి ఏర్పడుతుంది. దీనిని ఎల్‌నినో అంటారు. పెరూ తీరంలో అల్పపీడనం ఉండటం వల్ల భారత్‌పైకి వీచే నైరుతి రుతుపవనాలు అక్కడికి లాగబడతాయి. దీని మూలంగా భారత్‌లో కరువు పరిస్థితులు ఏర్పడుతాయి.
లానినో: పెరూ తీరానికి పక్కగా వెళ్లే హంబోల్ట్ శీతల ప్రవాహం మూలంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గి అధిక పీడన పరిస్థితులు ఏర్పడటాన్నే లానినో అంటారు. భారతదేశం మీదకి రుతుపవనాలు అధికంగా వీస్తాయి. దీని మూలంగా దేశంలో అధిక వర్షాలు సంభవిస్తాయి. పెరూ తీరంలో కరువు పరిస్థితులు ఏర్పడతాయి.
దక్షిణ డోలనం: పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం మీదికి పవనాలు దక్షిణ దిక్కున అటూఇటూ స్థానాలు మారుతూ కదలడాన్ని దక్షిణ డోలనం అంటారు. ఈ దక్షిణ డోలనం జరిగేటప్పుడు ఎల్‌నినో ఏర్పడితే దానిని ఎల్సో ఎఫెక్ట్ అంటారు.
వాకర్ సర్క్యులేషన్: హిందూ మహాసముద్రం, పసిఫిక్ సముద్రం మీది పవనాలు భూభాగం మీద ఉన్న అధిక, అల్ప పీడనాలను ఆసరాగా చేసుకొని వృత్తాకారంలో చలిస్తూ ఉండటాన్ని వాకర్ సర్క్యులేషన్ అంటారు. ఈ వృత్తాన్ని మొదటిసారిగా సర్ గిల్బర్ట్ గుర్తించారు.
అంతర ఆయన రేఖా అభిసరణ మండలం(ఐటీసీజెడ్): ఉత్తరార్థ గోళంలోని ఈశాన్య వ్యాపార పవనాలు, దక్షిణార్థ గోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖ వద్ద కలిసే ప్రాంతాన్ని ఐటీసీజెడ్ అంటారు. ఈ ఐటీసీజెడ్ వేసవి కాలంలో ఉత్తరార్థ గోళంలో 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ ఐటీసీజెడ్ 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీదికి దీన్నే రుతుపవన ఆరంభం అంటారు. శీతాకాలం, వర్షాకాలంలో ఐటీసీజెడ్ వ్యతిరేక దిశలో అంటే సముద్రాల మీదికి మారుతుంది.
ప్రాక్టీస్ ప్రశ్నలు
1. భారతదేశంపై ఎల్‌నినో సాధారణంగా వర్షాభావానికి కారమవుతోంది. మరి వర్షపాతాన్ని తెచ్చేది కింది వానిలో ఏది? (3)
1) దక్షిణ డోలనం
2) భూమధ్యరేఖా
హిందూ మహాసముద్ర డోలనం
3) లా నినో
4) హిందూ మహాసముద్రపు డైపోల్
2. ఈ శాన్య రుతుపవనాల వల్ల ఏ ప్రాంతంలో వర్షం పడుతుంది? (4)
1) వాయవ్య ప్రాంత మైదానాలు
2) నైరుతి దిశలోని సాగర ప్రాంతం
3) హిమాలయాలు 4) తూర్పు తీరం
3. ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే రాష్ట్రం? (1)
1) తమిళనాడు సముద్ర తీరం 2) అసోం
3) గంగా మైదానం 4) కశ్మీర్
4. ఇండియాలో ఈశాన్య రుతుపవనాలు ఎప్పుడు తిరుగుముఖం పడతాయి? (4)
1) మార్చి నుంచి మే వరకు
2) జూన్ నుంచి సెప్టెంబర్
3) సెప్టెంబర్ నుంచి జనవరి వరకు
4) అక్టోబర్ నుంచి నవంబర్ వరకు
5. భారతదేశంలో రుతుపవనాలు తిరోగమించేది? (2)
1) సెప్టెంబర్ మధ్యకాలం
2) నవంబర్ మధ్యకాలం
3) అక్టోబర్ మధ్యకాలం
4) జనవరి మధ్యకాలం