- నాగర్కర్నూల్, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో విషాదం
- ఖమ్మం జిల్లా కారేపల్లిలో భార్యాభర్తలకు గాయాలు
కల్వకుర్తి, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మ బండ తండాలో బుధవారం కురిసిన వర్షానికి పిడుగు పడి ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వెల్దండ ఎస్సై నర్సింహులు కథనం ప్రకారం..ఈదమ్మ బండ తండా కు చెందిన నేనావత్ నాంకు(50), నేనావత్ రుక్మి(25) మరో ముగ్గురు కలిసి బుధవారం పశువులను పొలానికి తీసుకువెళ్లి మేపుతున్నారు. ఇంతలో వర్షం మొదలుకాగా, ఐదుగురు దగ్గర్లోని చెట్టు కిందికి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడడంతో నాంకు, రుక్మి అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
గుడిసెలో ఉన్న రైతుపై..
రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కన్నాయపల్లిలో బుధవారం పిడుగుపడడంతో ఓ రైతుతో పాటు రెండు ఎడ్లు చనిపోయాయి. గ్రామానికి చెందిన అటాల చంద్రమౌళి (45) బుధవారం వ్యవసాయ పనులు ముగించుకుని ఎండ్లను వ్యవసాయ బావి వద్ద ఉన్న గుడిసెలో కట్టేశాడు. ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో గుడిసె నుంచి కదల్లేదు. అప్పుడే పిడుగు పడడంతో ఎడ్లతో పాటు చంద్రమౌళి కూడా అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ట్రాక్టర్ డ్రైవర్
దండేపల్లి : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం శివారులో బుధవారం మధ్యాహ్నం పిడుగుపడి ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయాడు. గ్రామానికి చెందిన రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న కొమ్ము సత్తన్న(33)..తన యజమాని పొలంలో పురుగుల మందు స్ప్రే చేస్తున్న మరో కూలికి సాయంగా వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అప్పుడే సత్తన్నపై పిడుగుపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
చెట్టు కిందికి పరిగెత్తుతుండగా...
కారేపల్లి : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గరిడేపల్లికి చెందిన గుగులోత్ గోపి, సునీత భార్యాభర్తలు. వీరు కారేపల్లి మండలంలోని భల్లూనగర్ తండాలో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. బుధవారం చేనులో పనులు చేసుకుంటుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో ఓ చెట్టు కిందికి పరిగెత్తుతుండగా ఆ చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టుకు దగ్గరలో ఉన్న గోపి శరీరం కొంత భాగం కాలి అక్కడే పడిపోయాడు. సునీత స్పృహ తప్పి పడిపోయింది. చుట్టుపక్కల రైతులు వీరిని గమనించి కారేపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.