తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. సెప్టెంబర్ ఒకటి నుంచి ఎల్లో అలర్ట్

హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంది. వానాకాలంలోనూ ఎండాకాలం ఎండలను చూస్తున్నారు జనం. కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. 2023, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు శుక్ర, శని, ఆదివారాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ శాఖ. 

ఆగస్ట్ 31వ తేదీ గురువారం సాయంత్రం నుంచే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని.. శుక్ర, శని, ఆదివారాలు మాత్రం ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం పడుతుందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఉదయం పూట పొగ మంచు ఉంటుందని.. మధ్యాహ్నం తర్వాత వానలు పడతాయని వివరించింది. 

ALSO READ :దళితబంధుపై హైకోర్టులో పిల్ : కొందరికే లబ్ధి రాజ్యాంగానికి విరుద్ధం

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే సెప్టెంబరు నెలలో మాత్రం వర్షాలు బాగా పడతాయని అంచనా వేస్తుంది వెదర్ డిపార్ట్ మెంట్. ఈ వర్షాకాలం సీజన్ లోనే వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయని.. ఓవరాల్ గా చూస్తే సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైందని వెల్లడించింది. హైదరాబాద్ సిటీ పరిధిలోనూ సగటు వర్షపాతం మాత్రమే పడిందని.. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లోనే అత్యధిక వర్షం పడిందని.. మిగతా అన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షమే పడినట్లు వివరించింది వాతావరణ శాఖ. 

సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని.. ఒకటో తేదీ నుంచే వర్ష సూచనలు ఉన్నట్లు స్పష్టం చేసింది.