యూఏఈలో మళ్లీ భారీ వర్షాలు..దుబాయ్, అబుధాబి అతలాకుతలం

యూఏఈలో మళ్లీ భారీ వర్షాలు..దుబాయ్, అబుధాబి అతలాకుతలం
  • పలు విమాన సర్వీసులు రద్దు

దుబాయ్: యునైటెడ్  అరబ్  ఎమిరేట్స్ (యూఏఈ) లో మళ్లీ భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గురువారం తెల్లవారుజామున వచ్చిన భారీ వానలతో దుబాయ్, అబుధాబి అతలాకుతలమయ్యాయి. వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి. దుబాయ్​లో పలు విమాన సర్వీసులతో పాటు బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి. దుబాయ్​కి వెళ్లాల్సిన ఐదు విమానాలను దారి మళ్లించారు.

అలాగే, తొమ్మిది విమాన సర్వీసులు, నాలుగు ఔట్ బౌండ్  సర్వీసులను రద్దు చేశారు. ఎమిరేట్స్ కూడా ఐదు విమాన సేవలను రద్దు చేసింది. దుబాయ్, అబుధాబిలో తెల్లవారుజామున 3 గంటలకే ఉరుములు, మెరుపులతో కూడిన భీకర వర్షాలు కురిశాయి. 4 గంటలకల్లా దేశవ్యాప్తంగా నల్లని కారు మబ్బులు విస్తరించాయి. జెబెల్  అలీ, అల్ మక్తొమ్  ఇంటర్నేషనల్  ఎయిర్ పోర్టు, దుబాయ్  ఇండస్ట్రియల్  సిటీ, దుబాయ్  ఇన్వెస్ట్ మెంట్  పార్క్, జుమైరా విలేజ్  ట్రయాంగిల్​లో వానలకు తోడు భీకరంగా గాలులు కూడా వీచాయి.

దీంతో దుబాయ్, అబుధాబి, షార్జాలో ప్రతికూల పరిస్థితుల కారణంగా తమ విమాన సేవలను రద్దు చేస్తున్నామని ఇండిగో ట్విటర్​లో తెలిపింది. కాగా, శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దుబాయ్  వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులకు సూచించింది.