వరదలతో రైల్వేకు రూ.30 కోట్ల నష్టం

వరదలతో రైల్వేకు రూ.30 కోట్ల నష్టం
  • చాలా చోట్ల దెబ్బతిన్న ట్రాక్​లు
  •  563 రైళ్లు రద్దు, 13 రైళ్లు పాక్షికంగా క్యాన్సిల్
  •  185 ట్రైన్లు దారిమళ్లింపు
  •  పూర్తయిన కేసముద్రం ట్రాక్  రిపేర్లు
  •  ఆర్టీసీకీ రూ.2 కోట్ల దాకా నష్టం!

హైదరాబాద్/మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత 3 రోజుల పాటు కరిసిన భారీ వర్షాలు, వరదలతో దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నష్టం జరిగింది. భారీ వానలకు చాలా చోట్ల ట్రాక్ లు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల ట్రాక్  లు వరదలో కొట్టుకుపోయాయి. దీంతో 563 రైళ్లను పూర్తిగా, 13 రైళ్లను పాక్షికంగా రద్దుచేశారు. మరో 185 రైళ్లను దారి మళ్లించారు. దీంతో ఇప్పటి వరకు సుమారు రూ.30 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కేవలం ట్రాక్ లు దెబ్బతినడంతోనే  రూ.5 కోట్ల నష్టం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఇక వందల సంఖ్యలో రైళ్లను రద్దుచేయడంతో  ఒక్కో రైలు రద్దు వల్ల ఎంత నష్టం జరిగిందో లెక్కలు తీస్తున్నారు.

అయితే, నష్టం అంచనా రూ. 30 కోట్లకు పైనే ఉంటుందని  అనధికారిక సమాచారం. మరోవైపు ఇంటికన్నె–కేసముద్రం సెక్షన్  ట్రాక్  పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్రాక్  రిపేరు  పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్  మేనేజర్  అరుణ్  కుమార్  జైన్  స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో ఆయన మాట్లాడారు. వీలైనంత త్వరగా రిపేర్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కేసముద్రం ట్రాక్  పునరుద్ధరణ పనుల్లో సుమారు 500 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. బుధవారం ఉదయం వరకు ఒక లైన్, సాయంత్రం వరకు మరో లైన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. 

మానుకోటలో రాత్రి ట్రయల్ రన్

మహబూబాబాద్​ జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె  వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను అధికారులు పునరుద్ధరించారు. మంగళవారం రాత్రి ట్రయల్ రన్  నిర్వహించారు. అనేక చోట్ల రైల్వే ట్రాక్  కింద ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు. 500 మంది రైల్వే సిబ్బంది.. భారీ యంత్రాల సహాయంతో రాత్రింబవళ్లు శ్రమించి రిపేరు పనులు పూర్తిచేశారు. ట్రాక్ పై ట్రయల్  రన్  విజయవంతమైతే యథావిధిగా రైళ్లు నడపనున్నారు.

బస్సులు.. రైట్ రైట్

రాష్ట్రవ్యాప్తంగా వానలతో మూడు రోజుల పాటు డిపోలకే పరిమితమైన బస్సులు మంగళవారం నుంచి వివిధ రూట్లలో తిరిగాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రోడ్లు బాగున్న రూట్లలో యథావిధిగా బస్సులు నడిపామని, దెబ్బతిన్న రూట్లలో మాత్రం  నడపలేదని చెప్పారు. అలాగే,  హైదరాబాద్  నుంచి విజయవాడ వెళ్లే బస్సులను సోమవారం రాత్రి నుంచే పునరుద్ధరించామని వెల్లడించారు. అయితే, వరదలతో మూడు రోజుల పాటు వెయ్యికి పైగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రూ. సుమారు రూ. 2 కోట్ల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.