30 నుంచి 40 km వేగంతో ఈదురుగాలులు.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

30 నుంచి 40 km వేగంతో ఈదురుగాలులు.. ఉరుములు, మెరుపులతో  భారీ వర్షం

 రాష్ట్రానికి వర్షసూచన జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వచ్చే 5 రోజులు పాటు వర్షాలు కురిసే చాన్స్ ఉందన్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్టిచ్చారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు.   తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల రాష్టంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. 

ఇవాళ ఉరుములు, మెరుపులుతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ, రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి,  జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. 

ఈనెల 9న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి మహబూబ్ నగర్, నగర్ కర్నూల్  జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో  భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీచేశారు అధికారులు.  శనివారం  హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బషీర్ బాగ్ , అబిడ్స్ , కోఠి , హిమాయత్ నగర్ , నారాయణగూడ సికింద్రాబాద్,బేగంపేట్, అమీర్ పేట్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్,పంజాగుట్ట,బోరబండ ,హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో  తెలికపాటి వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వాన పడింది. 

సిటీతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వానలు కురిశాయి. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో వర్షాలుపడ్డాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అత్యధికంగా 6.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 5.5, వికారాబాద్ జిల్లా తాండూరులో 5.1, భద్రాద్రి జిల్లా గుండాలలో 5సెంటీ మీటర్ల వాన పడింది.