Weather Alert: ఏపీలో భారీ వర్షాలు... ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో క్రమంగా విస్తరించి చురుగ్గా మారినట్టు తెలిపింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బంగాళాఖాతంలో రుతుపవనాల ప్రభావం బలంగా ఉండడంతో తీరం వెంబడి గంటకు 45- 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ.ఈ నేపథ్యంలో మూడు రోజులు పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాడు మన్యం, విజయనగరం, అల్లూరి, కర్నూలు, నంద్యాల అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు, చెట్ల కిందకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.