పంటలకు ప్రాణం .. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు

  • వాగులు, కుంటల్లో వచ్చి చేరుతున్న వరదనీరు 

నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముసురు కమ్ముకుంది. గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పుడిప్పుడు చిన్నచిన్న చెరువుల, వాగులు, కుంటల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లాల్లో కరుస్తున్న ముసురుతో పత్తికి జీవం పోసినట్లయింది. వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ సీజనల్​లో మొదటిసారి పత్తి విత్తిన తర్వాత వానలు పడకపోవడంతో విత్తనాలు భూమిలోనే మాడిపోయాయి. దీంతో రెండోసారి విత్తాల్సిన పరిస్థతి ఏర్పడింది. 

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు..

నల్లొండ, యాద్రి, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎంతకీ ముసురు విడవకపోవడంతో రోడ్లపై జన సంచారం తగ్గింది. ప్రజలు తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకున్నారు. కుటుంబ అవసరాల కోసం  తప్పనిసరి అయితే ప్రజలు రోడ్ల పైకి వచ్చారు. సూర్యాపేట జిల్లాలో 193.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

అత్యధికంగా మునగాల మండలంలో 17.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, చివ్వెంల 15.3, ఆత్మకూర్ (ఎస్) 14.0, నడిగూడెం 13.05, జాజిరెడ్డిగూడెం 12.05, నాగారం 11,09, చిలుకూరు 11.03, తిరుమలగిరి 11,0, సూర్యాపేట మండలంలో 10.03 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంత్రాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులకు 811.91 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండడంతో ప్రస్తుతం 639 అడుగులకు నీటి మట్టం కొనసాగుతోంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్ట్ కు  నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. 

నాగార్జునసాగర్ కు నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 504.60 అడుగులు నిల్వ ఉంది. ఎస్ ఎల్ బీసీ తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ కు800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎడమ కాల్వకు 3374, కుడికాల్వకు 5700 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతోంది.