మహారాష్ట్రలో కుండపోత.. ముంబై, పుణే ఆగమాగం

మహారాష్ట్రలో కుండపోత.. ముంబై, పుణే ఆగమాగం

ముంబై : మహారాష్ట్రలో భారీ వర్షాలు పడ్తున్నాయి. కుండపోత వర్షాలకు ముంబై, పుణే ఆగమాగమయ్యాయి. రెండు సిటీల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. రైల్వే శాఖ కూడా పలు ట్రైన్లను దారిమళ్లించగా.. మరికొన్నింటిని క్యాన్సిల్ చేసింది. రైలు పట్టాలపై నీళ్లు చేరడంతో లోకల్ ట్రైన్లను  ఆపేశారు. రోడ్లన్నీ నీట మునిగాయి.

ముంబైకి తాగునీరు అందించే ఏడు చెరువుల్లో రెండు పొంగి పొర్లుతున్నాయి. సియాన్, చెంబూర్, అంధేరి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు ముంబై, థానే, రాయ్​గఢ్​కు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

థానే పరిస్థితి దారుణంగా ఉంది. గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 14 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రెస్క్యూ సిబ్బంది సేఫ్ ప్లేస్​లకు తరలిస్తున్నారు. స్కూల్స్, కాలేజీలకు రెండు రోజుల పాటు అధికారులు సెలవు ప్రకటించారు.

నలుగురు మృతి

వర్షపు నీటి కారణంగా పుణేలో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందారు. మరొకరు థానే బర్వీ  డ్యాంలో మునిగిపోయి చనిపోయారు. ముంబైలోని విఖ్రోలి ప్రాంతం నీట మునిగింది. విష్ణుపురి డ్యాం గేట్లు ఎత్తేశారు. సబ్ వేల్లో నీళ్లు చేరాయి. అంధేరి, పొవాయి, దిన్​డోషి, ఘాట్​కోపర్, శాంతాక్రజ్, చార్కోప్, బీకేసీతో పాటు పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.

బద్లాపూర్ బ్యారేజీ, జంబుల్ డ్యామ్, మోహనే డ్యామ్ కు భారీగా వరద చేరుతున్నది. పాల్ఘర్ జిల్లాలోని ఉల్హాస్, కాలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాయ్​గఢ్​లోని సావిత్రి, అంబా, కుండలీక, పాతాళగంగా నదులు డేంజర్ మార్క్​ను క్రాస్ చేశాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ ఎయిర్​లైన్స్ సంస్థలు కొన్ని విమానాలను రద్దు చేయగా.. మరికొన్నింటి షెడ్యూల్ మార్చేశారు. సీఎం ఏక్​నాథ్ షిండే అధికారులతో సమావేశం అయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇంట్లో నుంచి బయటికి రావొద్దని సూచించారు.

కొట్టుకుపోయిన మనాలీ హైవే

హిమాచల్ ప్రదేశ్ లోనూ కుండపోత వానలు పడ్తున్నాయి. వరదల ధాటికి లేహ్ – మనాలీ నేషనల్ హైవే కొట్టుకుపోయింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తాయి. కులు జిల్లాలోని రోడ్లు దెబ్బతిన్నాయి. మనాలి ప్రాంతంలోని అంజనీ మహాదేవ్ వంతెన, నేషనల్ హైవేపై ధుండి, పల్చన్ మధ్య బ్రిడ్జి తెగిపోయాయి.  దీంతో ఈ రూట్​ను క్లోజ్ చేసి అటల్ టన్నెల్ ద్వారా లాహౌల్, స్పితి నుంచి మనాలీ వెళ్లే వెహికల్స్​ను రోహతంగ్ వైపు మళ్లించారు.

హిమాచల్​ ​లో 31వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మండి, కిన్నౌర్, కాంగ్రా జిల్లాలో రోడ్లు తెగిపోయాయి. గుజరాత్​లోని సబర్​కంఠాలో గోడ కూలి తల్లీ కొడుకు చనిపోయారు. రానున్న కొన్ని రోజుల పాటు మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఏపీ, తమిళనాడు, లడఖ్, తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.