వాన.. వరద.. తడిసి ముద్దైన ఓరుగల్లు

  • ఎగువన భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు
  • పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు

హనుమకొండ/ జయశంకర్​భూపాలపల్లి/ మహబూబాబాద్​/ జనగామ: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా, శనివారం రోజంతా ముసురు విడవలేదు. పలుచోట్ల చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. చెక్​డ్యామ్​లు మత్తడి దూకుతున్నాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్​జిల్లాల్లో కొంత తక్కుగానే వాన ఉండగా, జయశంకర్​భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం పడింది. ఎగువన భారీ వర్షాల కారణంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ​మేడిగడ్డ బ్యారేజీ వద్ద 3.84, సమ్మక్క సాగర్‌‌ వద్ద 4.85 లక్షల క్యుసెక్కుల ఇన్‌‌ఫ్లో ఉంది. రెండు జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అత్యధికంగా 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

తాడిచెర్ల, భూపాలపల్లి బొగ్గు గనుల్లో తాత్కాలికంగా బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. ఏజేన్సీలోని అటవీ గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అటవీ గ్రామాల్లో ప్రజలు అలర్ట్ గా ఉండాలని ప్రమాదపు ప్రదేశాలకు వెళ్లరాదని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. ములుగు జిల్లా పేరూర్ వద్ద సాయంత్రం 4 గంటలకు గోదావరి వరద ప్రవాహం 13.04  మీటర్లకు పెరిగింది. బొగత జలపాతం కు భారీగా వరదనీరు వస్తుంది. దీంతో సందర్శకులను స్విమ్మింగ్ కి అనుమతించడం లేదు. వెంకటాపురం మండలం లోని పాలెం వాగు ప్రాజెక్ట్ మూడు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలాల్లో గర్మిళ్లపల్లి- పెద్దపెల్లి జిల్లా ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగు వరద ఉధృతికి మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో టేకుమట్ల-రాఘవరెడ్డి పేట మధ్య హైలెవల్​బ్రిడ్జి తెగిపోగా, తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం అది కూడా కొట్టుకు పోవడంతో మండల కేంద్రంలో పని ఉన్నవారు మొగుళ్లపల్లి మీదుగా దాదాపు 25 కి.మీ పైన ప్రయాణం చేసి వెళ్తున్నారు.
 
జిల్లాల్లో వర్షపాతం..

జనగామ జిల్లాలో 10.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు శనివారం అధికారులు తెలిపారు. పాలకుర్తి మండలంలో అత్యధికంగా 19.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవగా, అత్యల్పంగా బచ్చన్నపేటలో 4.2 మిల్లీమీటర్ల వాన పడింది.  హనుమకొండ జిల్లాలో సగటున 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఆత్మకూరు, కమలాపూర్​ మండలాల్లో 2.4 సెం.మీ, దామెరలో 2.3, హసన్ పర్తిలో 2.2, హనుమకొండలో 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా వేలేరు, భీమదేవరపల్లి మండలాల్లో 8 మి.మీల వర్షపాతం నమోదైంది.  

సహాయక చర్యలను పరిశీలించిన అధికారులు

మహదేవపూర్/ పలిమెల,వెలుగు : భూపాలపల్లి జిల్లాలోని బార్డర్​మండలం పలిమెలలో కలెక్టర్​ రాహుల్​శర్మ, ఎస్పీ కిరణ్​ఖరే కలిసి సహాయక చర్యలను పరిశీలించారు. శనివారం మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది, ఛత్తీస్ గఢ్​ నుంచి ఇంద్రావతి నదికి వరద పోటెత్తడంతో గోదావరి నది పలిమెల మండలంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా మహదేవపూర్​ మండలంలోని పెద్దాంపేట వాగు వంతెనను పరిశీలించి, అక్కడి నుంచి జిల్లాలో అత్యవసర పరిస్థితులలో ఉపయోగించే వాటర్ బోట్ పనితీరును పరిశీలించి, గోదావరిలో బోటులో ప్రయాణించి గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు.

ఇదిలా ఉండగా, కాలేశ్వరం పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. పలు చోట్ల ఇండ్లు కూలాయి. కాళేశ్వరం వద్ద పుష్కర్ ఘాట్ మెట్ల వద్దకు వాటర్ చేరడంతో స్థానిక ఎస్సై చక్రపాణి, పెద్దంపేట వాగు ఉధృతిని పరిశీలించి ప్రజలను గోదావరిలోకి వెళ్లవద్దని మహదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ ప్రజలను హెచ్చరించారు. పలిమెల మండలంలో వైద్య సిబ్బంది పనులను జిల్లా వైద్య అధికారి మధుసూదన్ పరిశీలించారు. 

మున్నేరు వాగు నిండింది..

మహబూబాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా మున్నేరు వాగు, పాకల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం అత్యధికంగా బయ్యారంలో 71 ఎంఎం వర్షపాతం నమోదయ్యింది. జిల్లా సాధారణ వర్షపాతం 39.2ఎంఎం కాగా, 627.8 ఎంఎంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గార్ల మండలంలోని పాకాల వాగు వద్ద రాంపూర్ చెక్ డ్యామ్ నీటిమట్టం పెరిగి రోడ్డు పై నుంచి ప్రవహిస్తుండడంతో గార్ల నుంచి రాంపూర్, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, బయ్యారం సీఐ రవి కుమార్, సిబ్బంది వరద ప్రవాహాన్ని పరిశీలించి, సిబ్బందితో కలిసి రాకపోకలను నిలిపివేశారు.