నడిగడ్డను ముంచెత్తిన వాన .. పొంగి పొర్లిన వాగులు, వంకలు

నడిగడ్డను ముంచెత్తిన వాన .. పొంగి పొర్లిన వాగులు, వంకలు
  • అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలకు తిప్పలు

గద్వాల/ అలంపూర్, వెలుగు: భారీ వర్షాలు నడిగడ్డను ముంచెత్తుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం వరకు వాన దంచి కొట్టింది. అయిజ మండలంలో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అయిజ మండలంలోని పెద్దవాగు పొంగిపొర్లడంతో అంతర్రాష్ట్ర రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. గద్వాల చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా సోమవారం ఐదు చోట్ల పిడుగులు పడి ముగ్గురు చనిపోవడం, మరో ఐదుగురు గాయపడడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

భారీ వర్షాల కారణంగా గట్టు, అయిజ మండలాల్లోని స్కూళ్లకు కలెక్టర్  సంతోష్  సెలవు ప్రకటించారు. వెంకటాపురం, చిన్న తాండ్రపాడు విలేజ్ లో 12 సెం.మీ, ధరూర్ లో 9.3, రాజోలులో 9, మల్లాపురం, గద్వాల, ఉండవల్లి, కేటిదొడ్డిల్లో 8, గట్టులో 7.4, ఇటిక్యాలలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

పొంగిపొర్లిన వాగులు, వంకలు..

భారీ వర్షాలతో గద్వాల జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అయిజ, రాయచూర్  అంతర్రాష్ట్ర రహదారిపై పెద్దవాగు పొంగిపొర్లింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అయిజ, నాగులదిన్నె మధ్య తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉండవల్లి మండల కేంద్రంలో వాగు పొంగడంతో అనసూయమ్మ కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. ఉండవల్లి మండలం చిన్న ఆమదాలపాడు వద్ద వాగు పొంగడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.

రోడ్లన్నీ జలమయం..

జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నల్లకుంట, ఊర చెరువు నీళ్లు రోడ్లపైకి రావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. జడ్చర్ల కమ్యూనిటీ ఆసుపత్రిలోకి వర్షం నీరు చేరడంతో ఆవరణ అంత జలమయమైంది. పేషెంట్లు ఆసుపత్రికి వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్​ సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్, ఆసుపత్రి అధికారులు పరిస్థితిని సమీక్షించారు.

వనపర్తి/పెబ్డేరు/శ్రీరంగాపూర్/పానగల్: భారీ వర్షంతో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో వాగులు పొంగాయి. శ్రీరంగాపూర్​ మండలం శేరుపల్లి, పెబ్బేరు, కిష్టారెడ్డిపేట శివారులో రెండు చోట్ల నీటి ప్రవాహానికి రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అక్కడికి చేరుకొని వాహనదారులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. పానగల్  మండలం మాందాపూర్  గ్రామంలో 18 ఎకరాల్లో వేసిన వరి నాట్లు కొట్టుకపోయాయి. భీమా లిఫ్ట్​ కింద 18,19 కెనాల్​ పక్కనే ఉన్న చిన్న కాలువ తెగిపోవడంతో వరి నాట్లు కొట్టుకుపోయాయి. 

భారీ వర్షంతో జిల్లాలోని శ్రీరంగాపూర్​ మండలంలో 13.1సెం.మీ రికార్డు వర్షపాతం నమోదైంది. కొత్తకోట మండలం నాయపల్లిలో 11.7 సెం.మీ, జానంపేటలో 10.1, పెబ్బేరులో 8.7, అమరచింతలో 8.2, చిన్నంబావిలో 7.8, గోపాల్​పేటలో 6.9, వనపర్తిలో 6.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. వీపనగండ్ల, పాన్​గల్​ మండలాల్లో పంట పొలాలు మునిగిపోగా, చిన్న కాల్వల కట్టలు తెగిపోయి రైతులు ఇబ్బంది పడ్డారు.